సంక్రాంతి పండుగకు సొంతూర్లకు వెళ్లిన జనం తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటున్నారు. వెళ్లేటప్పుడు రద్దీ ఎంతగా ఉందో ఇప్పుడు కూడా పంతంగి టోల్ ప్లాజా వద్ద అదే స్థాయిలో వాహన రద్దీ నెలకొంది. కొంత దూరం వరకూ వాహనాలు నిలిచిపోయాయి. సెలవులకు సొంతూళ్లకు వెళ్లి, తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటుండడంతో విజయవాడ హైవే బిజీగా మారింది. ఈ క్రమంలో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా హైదరాబాద్ - విజయవాడ ఎక్స్‌ప్రెస్ వేపై 17 బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న నవాబు పేట నుంచి చిట్యాల మండలం పెద్దకాపర్తి వరకు ప్రమాద ప్రాంతంగా గుర్తించారు. ఈ మధ్యన ఎక్కువగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయని తెలిపారు.
బ్లాక్ స్పాట్స్ ఇవే
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న నవాబు పేట నుంచి చిట్యాల మండలం పెద్దకాపర్తి మధ్యలో నవాబు పేట, రామాపురం, శ్రీరంగాపురం, మేళ్లచెరువు క్రాస్ రోడ్డు, కట్టకొమ్ముగూడ క్రాస్, కొమరబండ, ఆకుపాముల, ముకుందాపురం, దురాజ్ పల్లి, జమ్మిగూడ, జనగామ క్రాస్, ఎస్వీ కాలేజ్, కొర్ల పహాడ్, కట్టంగూరు, నల్గొండ క్రాస్, చిట్యాల, పెద్ద కాపర్తి ఏరియాలను బ్లాక్ స్పాట్స్ ప్రాంతాలుగా గుర్తించారు. ఈ ప్రాంతాల మీదుగా వచ్చేటప్పుడు వాహనదారులు జాగ్రత్త వహించాలని పోలీసులు సూచించారు. అయితే, జాతీయ రహదారులు, స్థానిక రహదారులపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను, రోడ్డు ప్రమాదాలు జరిగేందుకు ఎక్కువ ఆస్కారం ఉన్న ప్రాంతాలను పోలీసులు బ్లాక్ స్పాట్లుగా గుర్తిస్తారు.
అయితే, ఈ సారి సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత వాహనాల్లో సొంత ఊరికి వెళ్లిన వారి సంఖ్య ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సంక్రాంతి పండక్కి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లిన ప్రైవేటు వాహనాల లెక్కను పోలీసులు వెల్లడించారు. విజయవాడ వైపుగా పంతంగి టోల్ గేట్ మీదుగా వెళ్లిన వాహనాల సంఖ్యను రాచకొండ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. సంక్రాంతి పండుగ కోసం గత రెండు రోజుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు 1.24 లక్షల వాహనాలు వెళ్లినట్లుగా రాచకొండ ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. జనవరి 12 గురువారం 56,500 వాహనాలు వెళ్లాయని, 13న 67,500 కార్లు వెళ్లినట్లు వివరించారు. పండుగల కోసం వెళ్తున్న వారిలో 90 శాతం మంది సొంత వాహనాల ద్వారానే వెళ్లినట్లు తెలిపారు. రెండు రోజుల్లో మొత్తం 98 వేలకు పైగా కార్లు హైదరాబాద్ నుంచి పంతంగి టోల్ గేట్ మీదుగా విజయవాడ వెళ్లినట్లు గుర్తించారు.
వరంగల్ వైపు 26 వేలు
హైదరాబాద్ నుంచి వరంగల్‌కు బీబీ నగర్ టోల్ గేట్ మీదుగా నిన్న 26 వేల వాహనాలు వెళ్లాయని.. అందులో 18 వేల కార్లు ఉన్నాయని రాచకొండ పోలీసులు తెలిపారు. వరంగల్ నుంచి హైదరాబాద్‌కు 13 వేలకు పైగా వాహనాలు వచ్చినట్లు స్పష్టం చేశారు.