PM Modi Speech: బీఆర్ఎస్‌కు సి-టీమ్ కాంగ్రెస్, ఈసారి కేసీఆర్ ఓడిపోవడం ఖాయం - మోదీ

ABP Desam   |  07 Nov 2023 06:44 PM (IST)

Telangana BJP Public Meeting: హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు.

హైదరాబాద్ లో మాట్లాడుతున్న ప్రధాని మోదీ

PM Modi in Hyderabad: తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఈ ప్రభుత్వం అతి పెద్ద మోసం బీసీలకు చేసిందని ప్రధాని మోదీ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలను ఎప్పుడూ బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. వారు ఎప్పుడూ తమ కుటుంబం కోసమే పని చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అనేది బీఆర్ఎస్ పార్టీకి సీ టీమ్ అని అన్నారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ పైన, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్రమైన విమర్శలు చేశారు. వీరు ఏనాడూ బీసీ వ్యక్తిని సీఎం చేయాలని ఆలోచించలేదని అన్నారు.

దళితులు, పీడితులు, ఆదివాసీలకు ఎప్పుడూ బీజేపీ అండగా ఉంటుందని అన్నారు. ‘‘అటల్ బిహారీ వాజ్ పేయీ ప్రభుత్వం సమయంలో మేమే ఏపీజే అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేశాం. జీఎంసీ బాలయోగిని బీజేపీ తొలి దళిత లోక్ సభ స్పీకర్ ను చేసిందని గుర్తు చేశారు. అలాగే తొలి దళిత రాష్ట్రపతిగా కూడా రామ్ నాథ్ కోవింద్‌ను చేసిందని, అలాగే ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా చేసి తొలి ఆదివాసీ వ్యక్తిని దేశాధినేత చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందని అన్నారు. తెలంగాణలో ఇప్పుడు బీసీ వ్యక్తి సీఎం కాబోతున్నారు. ఇది మోదీ గ్యారంటీ’’

బీఆర్ఎస్ నేతలకు అహంకారం - మోదీ‘‘నా కుటుంబ సభ్యులారా.. అహంకారం ఉన్నవారికి ప్రజలు ఓట్లు వేయరు. బీఆర్ఎస్ నేతల్లోనూ అలాంటి అహంకారం కనిపిస్తుంది. అవినీతి ప్రభుత్వాన్ని ఈసారి ఇంటికి పంపడం ఖాయం. 2019 లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు అలాంటి అహంకార సీఎంకు మీ ఓటుతో జవాబు ఇచ్చారు. ఇక్కడి నేతలు మోదీని తిడుతూ ఉంటారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ వేరు వేరు కాదు. ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలు. బీఆర్ఎస్ నేతలకు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో కూడా సంబంధాలు ఉన్నాయి. ఆ కేసును సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తుంటే ఆ సంస్థలను ఇక్కడి నేతలు తిడుతున్నారు. 

వేల సంఖ్యలో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ యువత జీవితాన్ని బీఆర్ఎస్ సర్కారు నాశనం చేస్తోంది. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ యువకుల జీవితాలను నాశనం చేస్తోంది. అన్ని నియామక పరీక్షల్లో అవకతవకలు కామన్ అయిపోయాయి. తెలంగాణ యువతను మోసం చేస్తున్న బీఆర్ఎస్ ను సాగనంపాలా వద్దా?-

పేదలకు ఉచిత రేషన్ ఇస్తున్నాం. మరో ఐదేళ్ల పాటు ఫ్రీగా బియ్యం ఇవ్వడాన్ని పొడిగిస్తున్నాం. ఇది మోదీ ఇస్తున్న గ్యారంటీ. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ కావాల్సిందే. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలి’’ అని ప్రధాని మోదీ మాట్లాడారు.

Published at: 07 Nov 2023 06:27 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.