Fire Accident at Charminar | హైదరాబాద్: నగరంలోని పాతబస్తీ చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మంటల్లో చిక్కుకుని 16 మంది మృతిచెందినట్లు సమాచారం. గుల్జార్ హౌస్ krishna pearls & modi peralsలో మొదటి అంతస్తులో అగ్ని ప్రమాదం సంభవించి మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ముగ్గురు చిన్నారులు సహా 16 మందిని రక్షించి హాస్పిటల్స్‌కు తరలించారు. ఇంకా లోపల ఉన్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
మంటల్లో చిక్కుకున్న పలువురిని పోలీసులు, అధికారులు కాపాడారు. వారిని చికిత్స నిమిత్తం మలక్ పేట యశోద, ఉస్మానియా హాస్పిటల్, అపోలో, డీఆర్‌డీవో ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బిల్డింగ్ లోపల 30 మంది వరకు ఉన్నట్టు సమాచారం. మొదట ఏడుగురిని రెస్క్యూ చేసి హాస్పటల్‌కు తరలించారు. ఆపై మరో తొమ్మిది మందిని భవనం నుంచి బయటకు తీసుకొచ్చారు. కాలిన గాయాలైన వారిని ఆసుపత్రులకు తరలించారు.
ముగ్గురు చిన్నారులు సహా 16 మందిని పలు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. హాస్పిటల్ కు తరలించిన వారిని పరీక్షించిన వైద్యులు కొందరు చనిపోయినట్లు నిర్ధారించారు. పొగ పీల్చడంతో ఊపిరితిత్తుల్లోకి చేరగా, మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
మృతులు: ఇరాజ్ (2), హర్షాలి గుప్తా (7), ఆరుషి జైన్ (17), అభిషేక్ మోడీ (30), షీతల్ జైన్ (37), రాజేందర్ కుమార్ (67), సుమిత్ర (65), మున్నిబాయి (72)లుగా పోలీసులు గుర్తించారు.
10 ఫైరింజన్లతో మంటలు ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. భారీ అగ్నిప్రమాదం కారణంగా చార్మినార్ వెళ్లే ప్రధాన మార్గాలను పోలీసులు తాత్కాలికంగా క్లోజ్ చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మొదటి అంతస్తులో నివసిస్తున్న పలువురు స్పృహ కోల్పోయినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.