Hyderabad News | హైదరాబాద్: భారీ వర్షాలు కురుస్తున్నాయని నాలా పరిశీలించేందుకు వెళ్లిన ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. నాలా వద్దకు వెళ్లిన ఎంఐఎం ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై స్థానికులు తిరగబడ్డారు. నాలా సమస్యను పరిష్కరించాలని ముందు కోరిన స్థానికులు, ఆపై నిలదీసి దాడికి పాల్పడ్డారు.  యాకుత్‌పుర పరిధిలో నాలా సమస్యను పరిష్కరించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడంలేదని యాకుత్‌పుర ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్‌ను స్థానికులు నిలదీశారు. వానాకాలం వచ్చినా కూడా నాలా పనులు చేయలేదని ప్రశ్నించారు.

ప్రజలు ఇబ్బంది పడుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్‌ను స్థానికులు నిలదీశారు. ఆయన అనుచరులు స్థానికులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వారి మధ్య వాగ్వాదం గొడవకు దారితీసింది. ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై స్థానికులు దాడి చేశారు. తమ సమస్య పరిష్కరించాలని కోరితే పట్టించుకోకుండా తమనే దబాయించడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్‌ను ఓ వ్యక్తి తోయడంతో అది గొడవకు దారి తీసి, ఎమ్మెల్యే వర్గం వర్సెస్ ప్రజలుగా పరస్పరం దాడి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.