Hopes Dashed For Hyderabad IMAX: హైదరాబాద్‌లో మూవీ లవర్స్‌కు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్. నగరంలో త్వరలోనే ఐమాక్స్ ఏర్పాటు కాబోతుందన్న వార్తల నేపథ్యంలో విజువల్ వండర్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఆస్వాదించొచ్చనే వారి ఆశలపై తాజాగా నీళ్లు చల్లారు.
ఆ వార్తలు అవాస్తవం
హైదరాబాద్ హకీంపేటలో త్వరలోనే 'ఐమాక్స్' ఏర్పాటు చేయబోతున్నట్లు ఆసియన్ మూవీస్ అధినేత సునీల్ నారంగ్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. రాబోయే రెండేళ్లలో ఈ థియేటర్ ఏర్పాటు చేస్తామని చెప్పడంతో అంతా హ్యాపీగా ఫీలయ్యారు. అయితే, తమతో భాగస్వామ్యం కానుందని వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని ఐమాక్స్ కార్పొరేషన్ (ఇండియా) వైస్ ప్రెసిడెంట్ ప్రీతం డేనియల్ అధికారికంగా ప్రకటించారు.
'హైదరాబాద్‌లో ఐమాక్స్ ఏర్పాటుకు ఐమాక్స్ ఆసియా సినిమాస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుందని ఇటీవల వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం. నగరానికి ఐమాక్స్ తీసుకు రావడానికి ఎగ్జిబిటర్లతో చర్చలు జరుపుతున్నప్పటికీ ప్రస్తుతం ఎలాంటి ఒప్పందం అమలులో లేదు. హైదరాబాద్‌లో ఐమాక్స్ పెట్టేందుకు ఆసక్తి ఉంది. అందుకు కావాల్సిన అవకాశాలను పరిశీలిస్తున్నాం.' అని స్పష్టం చేశారు. ఈ ప్రకటన తర్వాత, చాలా మంది నిరాశ చెందిన అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ నిరాశను వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి, తెలుగు రాష్ట్రాల్లో మరోసారి గొప్ప IMAX అనుభవాన్ని ఆస్వాదించాలనే కల ఇంకా అందుకోలేకపోయింది. కానీ ఇంకా ఆశ ఉంది - మరియు సినీ ప్రేక్షకులు సమీప భవిష్యత్తులో సానుకూల నవీకరణ కోసం ఎదురు చూస్తున్నారు.
సునీల్ నారంగ్ ఏమన్నారంటే?
ఈ అంశంపై తాజాగా ఆసియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ స్పందించారు. ఐమాక్స్‌పై చర్చలు జరపడానికి టైం పడుతుందని అన్నారు. 'కొద్ది రోజుల్లో డిసైడ్ చేస్తాం. ఓ ప్లానింగ్ ఉంది అంతే తప్ప అది వస్తుందని పూర్తిగా కన్ఫర్మ్ చెయ్యలేదు.' అని క్లారిటీ ఇచ్చారు.
నిరాశలో మూవీ లవర్స్
ఈ ప్రకటనలతో మూవీ లవర్స్ నిరాశకు గురవుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో 'ఐమాక్స్' థియేటర్స్ ఉన్నాయని.. స్టార్ హీరోల బెస్ట్ మూవీస్ అంతా విజువల్ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారని.. కానీ నగరంలో మాత్రం లేదంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే, భవిష్యత్తులోనైనా తమ ఆశ నెరవేరాలని ఆకాంక్షిస్తున్నారు.
Also Read: అలప్పూజా జింఖానా రివ్యూ: సోనీ లివ్ ఓటీటీలో మలయాళ స్పోర్ట్స్ డ్రామా - తెలుగులోనూ స్ట్రీమింగ్
భారీ స్క్రీన్, హై రిజల్యూషన్ పిక్చర్, పవర్ ఫుల్ ఆడియోతో.. ప్రేక్షకులకు ఎప్పటికీ మర్చిపోలేని థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది ఐమాక్స్. లేటెస్ట్ బాలీవుడ్ బ్లాక్ బస్టర్స్, ప్రభాస్ 'కల్కి' వంటి విజువల్ వండర్స్ ఐమాక్స్ సర్టిఫైడ్ కెమెరాలతోనే తీస్తుండగా.. ఆ ఎక్స్‌పీరియన్స్‌ను భాగ్యనగర వాసులు ఎంజాయ్ చేయలేకపోతున్నారు. చెన్నై, ముంబై, బెంగుళూరు, ఢిల్లీ సహా కోయంబత్తూర్, ఇండోర్ వంటి టైర్ 2 నగరాల్లో ఈ థియేటర్స్ ఉన్నాయి. కానీ.. హైదరాబాద్‌లో ఈ థియేటర్ లేదు. 'ప్రసాద్ మల్టీప్లెక్స్' పేరుతో అప్పట్లో ఓ థియేటర్ ఉన్నా.. 2014 నుంచి ఈ ఫార్మాట్ పూర్తిగా నిలిపేయడంతో క్లోజ్ అయిపోయింది.
'ఐమాక్స్' బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేయాలంటే సరికొత్త టెక్నాలజీతో పాటు భారీ బడ్జెట్ అవసరం. దీంతోనే ఎన్నో థియేటర్స్ 'ఐమాక్స్' ఏర్పాటు చేసేందుకు వెనకడుగు వేయగా.. ప్రసాద్స్ కూడా సొంత ఫార్మాట్ 'PCX' మొదలుపెట్టింది. తాజా ప్రకటనలతో 'ఐమాక్స్' హైదరాబాద్‌కు రావడానికి చాలా టైం పట్టే ఛాన్స్ ఉందని అర్థమవుతోంది. ఇది నగరంలో ఉన్న మూవీ లవర్స్ ఓ విధంగా నిరాశే అని చెప్పాలి.