ఢిల్లీ: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనను వెంటనే విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాక్ స్వాతంత్ర్యాన్ని రక్షించాలని సుప్రీంకోర్టు సూచించింది. భవిష్యత్‌లో జాగ్రత్తగా ఉండాలని ధర్మాసనం కొమ్మినేనిని హెచ్చరించింది.
కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు అక్రమమని దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జర్నలిస్ట్ కొమ్మినేని విడుదల చేయాలని ఆదేశించింది. జైలు నుంచి ఆయన విడుదలకు సంబంధించిన నిబంధనలను ట్రయల్ కోర్టు ఇస్తుందని జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం తెలిపింది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, నవ్వినంత మాత్రాన అరెస్టు చేస్తారా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలాగైతే కేసుల విచారణ సందర్భంగా తాము కూడా నవ్వుతుంటామని, వాక్ స్వాతంత్య్రాన్ని పరిరక్షించాలని సుప్రీంకోర్టు సూచించింది.
మరోవైపు డిబేట్లను గౌరవప్రదంగా నిర్వహించాలని, కేఎస్సార్ లైవ్ షో లో గెస్ట్ చేసిన వ్యాఖ్యలకు యాంకర్ ఎలా బాధ్యత వహిస్తారని ప్రశ్నించింది. అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దని గెస్ట్ ను యాంకర్ కొమ్మినేని నియంత్రించారని ధర్మాసనం పేర్కొంది. ఆయనకు ఎలాంటి నేర చరిత్ర లేదు, నోటీసు ఇవ్వకుండానే అరెస్ట్ సరికాదని అభిప్రాయం వ్యక్తం చేసింది కోర్టు.
ప్రాథమిక హక్కు ఆర్టికల్ 19, 21 ,22(1)ను ఉల్లంఘించారని, వాక్ స్వాతంత్రానికి భంగం కలిగించారని కొమ్మినేని పిటిషన్లో ఆయన తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. కొమ్మినేని దర్యాప్తును తప్పించుకునే ప్రయత్నం చేయలేదన్నారు. సీనియర్ సిటిజన్ అయినా ట్రాన్సిట్ రిమాండ్ తీసుకోలేదు, స్థానిక కోర్టులో కొమ్మినేని తరఫున న్యాయవాదిని అనుమతించలేదు అని పిటిషన్లో సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.