అహ్మదాబాద్: గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మొత్తం 265 మంది మరణించారు. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం అహ్మదాబాద్‌లో పర్యటిస్తున్నారు. మొదట అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుండి బయలుదేరిన ఎయిర్ ఇండియా AI171 విమానం కూలిపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆయన వెంటన కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. ప్రమాదానికి కారణాలపై అధికారులను, రామ్మోహన్ నాయుడును ఆయన ఆరా తీశారు.

అనంతరం అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్‌కు వెళ్లారు ప్రధాని మోదీ. ఘోర విమాన ప్రమాదంలో చనిపోయన వారి కుటుంబసభ్యులను ప్రధాని మోదీ పరామర్శించారు. వారి కుటుంబాలకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గాయపడి చికిత్స పొందుతున్న వారిని ప్రధాని పరామర్శించారు. విమాన ప్రమాదంలో బతికి బయటపడ్డ ఏకైక ప్రయాణికుడు మహేష్ విశ్వాస్ కుమార్ ను ప్రధాని మోదీ పరామర్శించి, అతడి అరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. భారత సంతతికి చెందిన బ్రిటిష్ జాతీయుడైన అతను 11A సీటులో ప్రయాణిస్తున్నాడు. విమానం కూలిన తరువాత అతను నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

ఎయిర్ ఇండియా ప్రకారం, బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానంలో 12 మంది సిబ్బంది, మొత్తం 230 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 169 మంది భారతీయులు కాగా, 53 మంది బ్రిటన్ పౌరులు, ఏడుగురు ఫ్రాన్స్ వాసులు, ఒక కెనడా వాసి ఉన్నారు. చనిపోయిన వారిలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉండటంతో బీజేపీ శ్రేణుల్లో విషాదం అలుముకుంది.

అహ్మదాబాద్ విమాన ప్రమాదం: ముఖ్యమైన అంశాలు 

  • పోలీస్ డిప్యూటీ కమీషనర్ కానన్ దేశాయ్ మీడియాతో మాట్లాడుతూ 265 మృతదేహాలు అహ్మదాబాద్‌లోని సివిల్ హాస్పిటల్‌కు చేరాయని తెలిపారు. 
  • విమానంలో ఉన్న 241 మందితో పాటు, ఐదుగురు MBBS విద్యార్థులు, ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ రెసిడెంట్ డాక్టర్ మరియు ఒక డాక్టర్ భార్య కూడా మరణించారు. విమానాశ్రయ పరిధికి వెలుపల ఉన్న BJ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో విమానం కూలిపోవడంతో మరో 60 మంది విద్యార్థులు గాయపడ్డారు. 
  • ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నాడు విమాన ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన వారిని పరామర్శించేందుకు అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్‌ను కూడా సందర్శించారు. 
  • ఈ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతిచెందారు.
  • విమానంలో ఉన్న బాధితుల కుటుంబాలకు సహాయం చేయడానికి, ఎయిర్ ఇండియా అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ మరియు గాట్‌విక్ విమానాశ్రయాలలో ఫ్రెండ్స్ & రిలేటివ్స్ అసిస్టెన్స్ సెంటర్లను ఏర్పాటు చేసిందని ఎయిర్ క్యారియర్ తెలిపింది. 
  • నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సునీల్ తత్కారే బంధువు కూడా ఈ ప్రమాదంలో మరణించారు. అపర్ణ మహడిక్ తత్కారే బంధువు భార్య, ఆమె ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తుండగా, ఆమె భర్త ఎయిర్ ఇండియాలో పైలట్‌గా పనిచేశారు. 
  • ప్రమాద స్థలంలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) ఆరు బృందాలు రాష్ట్ర, కేంద్ర ఏజెన్సీలతో కలిసి శిథిలాలను తొలగించే పనిలో నిమగ్నమై ఉన్నాయి, అని ఒక NDRF సిబ్బంది తెలిపారు.