Ahmedabad Plane Crash | అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం గురువారం నాడు కూలిపోవడంతో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. ఘటన గురించి సమాచారం అందుకున్నాక కేంద్ర హోం మంత్రి అమిత్ షా అహ్మదాబాద్ వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో అమిత్ షా మాట్లాడుతూ.. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఘటనతో దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుంది.
గురువారం (జూన్ 12) మధ్యాహ్నం ఎయిర్ ఇండియా విమానం AI171 బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ కూలిపోయింది. ఈ ఘటనలో భారీగా ప్రాణ నష్టం వాటిల్లింది. ఎయిర్ ఇండియా విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. విమానంలో ఏకంగా 1 లక్షా 25 వేల లీటర్ల ఇంధనం ఉంది. పైగా అధిక ఉష్ణోగ్రత కారణంగా ఎవరినీ రక్షించే అవకాశం లేకపోయింది. ప్రమాద స్థలాన్ని సందర్శించాను. అక్కడ పరిస్థితి చాలా భయానకంగా ఉంది. మృతదేహాలను వెలికితీసే ప్రక్రియ పూర్తయిందని’ అమిత్ షా చెప్పారు.
డీఎన్‌ఏ పరీక్షలు చేసి మృతదేహాల అప్పగింత
విదేశాల్లోని కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు. 1000 DNA పరీక్షలు చేసైనా మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగిస్తామని అమిత్ షా అన్నారు. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది తల్లిదండ్రులు, పిల్లలు, రక్త సంబంధీకుల నుంచి DNA నమూనాలను సేకరించామని టెస్టులు చేయిస్తాం.
సమీక్షలో ప్రతి అంశంపై చర్చించామని, విచారణను వేగంగా చేపట్టాలని విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడును ప్రధాని మోదీ ఆదేశించారని అన్నారు. సహాయక చర్యల్లో పాల్గొన్న అన్ని ఏజెన్సీలకు, వారి వేగవంతమైన, సమన్వయంతో సేవలు అందిించారని వారికి అమిత్ షా ధన్యవాదాలు తెలిపారు.
“ఈ విషాదంలో తమ కుటుంబసభ్యులను కోల్పోయిన వారందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ప్రమాదం జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. ప్రమాదాలు జరగకుండా ఎయిర్ లైన్స్ కండీషన్ చెక్ చేసుకోవడం, ఇతరత్రా తనిఖీలు సరిగ్గా చేయడం వరకే మన చేతుల్లో ఉంటుందన్నారు.
ఎయిర్ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం, ప్రమాద సమయంలో 230 మంది ప్రయాణికులు అందులో ఉన్నారు. వారిలో 169 మంది భారతీయులు కాగా, 53 మంది బ్రిటన్ వాసులు, ఏడుగురు ఫ్రాన్స్ పౌరులు, ఒక కెనడా జాతీయుడు ఉన్నారు. విమానంలో ఉన్న 12 మందిలో ఇద్దరు పైలట్లు, 10 మంది ఇతర సిబ్బంది ఉన్నారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ప్రకారం, మధ్యాహ్నం 1.39 గంటలకు అహ్మదాబాద్ నుంచి లండన్ లోని గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన వెంటనే 'మేడే' డిస్ట్రెస్ కాల్ ఇచ్చారు. ఇంజిన్లు రెండు ఫెయిల్ అయ్యాయని, అందుకే అత్యవసర పరిస్థితిని సూచించేలా మేడే కాల్ ఇచ్చారని తెలుస్తోంది. విమానం క్రాష్ అయిన వెంటనే అక్కడ మంటలు చెలరేగి, ఆ ప్రాంతాన్ని దట్టమైన పొగ కమ్మేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.