Operation Amanat: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఈ ఏడాది 2022లో రూ.1.54 కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుని తిరిగి ఇచ్చింది. ‘ఆపరేషన్ అమానత్’లో భాగంగా ప్రయాణికులు పొగొట్టుకున్న వస్తువులను తిరిగి ఇచ్చింది. వాటి విలువ దాదాపు. రూ. 1.54 కోట్లుగా ఉంటుందని ఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. ప్రయాణికులు పోగొట్టుకున్న, మర్చిపోయిన వస్తువులను, లగేజీ బ్యాగులను ఇచ్చి వారికి ఆర్పీఎఫ్ సాయం చేసింది. 


పోగొట్టుకున్న వస్తువులు అందజేత..


మొబైల్ ఫోన్లు, ల్యాప్ ‌టాప్ ‌లు, నగలు, నగదు మొదలైన విలువైన వస్తువులను రైల్వే అథారిటీ తిరిగి పొందింది. ఆయా వస్తువులను, బ్యాగులు వాటి యజమానులకు తిరిగి ఇచ్చింది. 2021లో 615 సందర్భాలలో ప్రయాణీకుల సామాను, విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుని యజమానులకు తిరిగి ఇచ్చినట్లు ఆర్పీఎఫ్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ దేబాష్మితా చటోపాధ్యాయ బెనర్జీ తెలిపారు.


ఇందులో రూ.1.44 కోట్ల విలువైన ల్యాప్‌టాప్, పర్సులు, లగేజీ బ్యాగులు, మొబైల్ ఫోన్‌లు ఉన్నాయి. 2022లో సెప్టెంబరు వరకు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సిబ్బంది 608 సందర్భాలలో విలువైన వస్తువులను కనుగొని, తిరిగి ఇవ్వగలిగారు. వస్తువుల మొత్తం విలువ రూ.1.54 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. 


'ఆపరేషన్ అమానత్’ 


ఆపరేషన్ అమానత్ కింద ఆర్పీఎఫ్ సిబ్బంది ఎల్లప్పుడూ ముందంజలో ఉంటారు. వారు రైల్వే ఆస్తులను మాత్రమే కాకుండా, ప్రయాణీకులు పోగొట్టుకున్న సామాన్లను భద్రపరచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తారని ఆర్పీఎఫ్ అధికారి తెలిపారు.


సిబ్బంది పనితీరు భేష్


1.84 లక్షల విలువైన విలువైన వస్తువులను ఆర్పీఎఫ్ సిబ్బంది సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణీకుల విలువైన వస్తువులను భద్రపరచడంలో, వాటిని యజమానులకు తిరిగి అప్పగించడంలో ఆర్పీఎఫ్ సిబ్బంది ప్రతిస్పందనను ఆర్పీఎఫ్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ దేబష్మితా చటోపాధ్యాయ బెనర్జీ ప్రశంసించారు.


సాయం కావాలంటే 139కు  కాల్ చేయండి


'ఆపరేషన్ అమానత్' కింద ప్రతి సంవత్సరం కోట్ల విలువైన ప్రయాణీకుల వస్తువులను భద్రపరచడంలో, తిరిగి అందజేయడంలో ఆర్పీఎఫ్ సిబ్బంది మంచి పని తీరు కనబరుస్తున్నారు. రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు వ్యక్తిగత వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, రైలును వీడి వెళ్తున్నప్పుడు ఒకటికి రెండు అన్ని బ్యాగులు, ఇతర వస్తువులు, సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్‌లు, పర్సులు ఉన్నాయో లేదో జాగ్రత్తగా చూసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. రైల్వేలో ప్రయాణిస్తున్నప్పుడు తమ వ్యక్తిగత వస్తువులను భద్రంగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రైలు ప్రయాణంలో ఏదైనా వస్తువు పోగొట్టుకున్నా, మర్చిపోయినా వెంటనే టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 139కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ఆర్పీఎఫ్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ దేబష్మితా చటోపాధ్యాయ బెనర్జీ సూచించారు. 


పోయాయనుకున్న వస్తువులు తిరిగి అందుకోవడం పట్ల ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది తమ వస్తువులు తిరిగి ఇవ్వడంపై హర్షం తెలుపుతున్నారు. విలువైన వస్తువులు, నగదు, ఫోన్లు, ల్యాప్ టాప్ లాంటివి తిరిగి ఇవ్వడాన్ని వారు ప్రశంసిస్తున్నారు.