KTR Will be Next CM says TS Minister Srinivas Goud: మునుగోడు ఉప ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్, బీజేపీ ప్రచార జోరు పెంచింది. ఈ క్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అని వ్యాఖ్యానించారు. అయితే కేసీఆర్ కుమారుడిగా కేటీఆర్ ఎట్టి పరిస్థితుల్లో సీఎం అవ్వరని.. అన్ని అర్హతలున్న వ్యక్తిగా, సమర్థుడిగా కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఎప్పటికైనా కేసీఆర్ తరువాత కేటీఆర్ సీఎం అవుతారని చెప్పారు.


ఎన్నేళ్ళకయినా సీఎం అయ్యేది కేటీఆర్ మాత్రమే..
కేసీఆర్ తర్వాత ఎన్నేళ్ళ కయినా తెలంగాణ కు సీఎం అయ్యేది కేటీఆర్ మాత్రమేనన్నారు. ఈ విషయాన్ని టీఆర్ఎస్ లో ఎవరిని అడిగినా చెబుతారు. అదే విషయాన్ని నేను చండూరు లో చెప్పానని గుర్తుచేశారు. బీసీ లకు తెలంగాణలో జరుగుతున్న మేలు దేశం లో మరెక్కడా జరగడం లేదన్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేయొచ్చు.. ఎవరు కాదన్నారు. చిరంజీవి పార్టీ గతం లో పోటీ చేయలేదా అని ప్రశ్నించారు. మునుగోడులో ప్రజలు మా వైపు ఉన్నారని, బీజేపీ ప్రజలను గందర గోళ పరిచే పనిలో బిజీగా ఉందని విమర్శించారు. కానీ మునుగోడు ప్రజలు బీజేపీ ని నమ్మరని అభిప్రాయపడ్డారు.


బీజేపీ నేతలు మాయమాటలు చెబుతున్నారు
మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ నేతల మాట్లాడుతున్న తీరు సరిగా లేదని, ప్రజలకు బీజేపీ నేతలు మాయమాటలు చెబుతున్నారంటూ మండిపడ్డారు. ఎన్నికల కమిషన్, కేంద్రం తమ చేతుల్లో ఉందని బీజేపీ నేతలు కుట్రలు చెస్తున్నారని, అంబానీ ఆదానీ ల డబ్బులతో బీజేపీ గెలుద్దామనుకుంటోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలిచే ప్రసక్తే లేదన్నారు. ఉపఎన్నిక ఎందుకు తెచ్చారనే దాని పై బీజేపీ నేతలు సరైన కారణం చెప్పలేక పోతున్నారు. ఒక పక్క అంబానీ, ఆదానీ లు, మరో ప్రక్క ఈడీ.. బీజేపీ రెండు పక్కల నుంచి మునుగోడు లో చెలరేగుతోందంటూ ఎద్దేవా చేశారు. 


ఛీ కొడుతున్నా బుద్ది రావడం లేదు
ప్రజలు మునుగోడులో బీజేపీ ని ఛీ కొడుతున్నా ఆ పార్టీ నేతలకు బుద్ది రావడం లేదన్నారు శ్రీనివాస్ గౌడ్. కారును పోలిన గుర్తులు వద్దంటున్నా కేటాయించేలా చేసి బీజేపీ తొలి కుట్రకు తెర లేపిందని ఆరోపించారు. ఇన్నేళ్ల బీజేపీ పాలన లో మంచి నీళ్లు ఇచ్చిన పాపాన పోలేదని, దుబ్బాక లో హుజూరా బాద్ లో గెలిచి కూడా హామీలు నిలుపు కోలేని బీజేపీ ఇపుడు మునుగోడు లో అవే హామీలు ఇస్తోందన్నారు. తెలంగాణ లో మత కల్లోలాలు రేపే కుట్రకు బీజేపీ తెర లేపుతోందని, మత ఘర్షణలు రేపి ఓట్లు దండుకోవడం తప్ప బీజేపీకి ఏమీ చేతకాదన్నారు. బీజేపీ కేంద్రంలో చేసింది చెప్పుకోవడం చేతకాకనే కేసీఆర్, కేటీఆర్ ల మీద విమర్శలు చేస్తోందన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు.


మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంకా ఏమన్నారంటే..
- సీఎం కేసీఆర్ నల్లగొండ నుంచి ఫ్లోరోసిస్ ను తరిమారు. సొరియాసిస్ లాంటి బీజేపీ ని కూడా సాగనంపుతారు. 
- ధర్మం టీఆర్ఎస్ వైపు ఉంది. అధర్మం బీజేపీ వైపు ఉంది. మునుగోడు లో ధర్మమే గెలుస్తుంది
- నరేంద్ర మోదీ అనగానే ప్రజలకు గుర్తొచ్చేది గ్యాస్ సిలిండర్ మాత్రమే. పెరిగిన ధరలను గుర్తుంచుకొని బీజేపీకి బుద్ది చెబుతారు
- కరోనా వ్యాక్సిన్ ను మోదీయే కనిపెట్టారని బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. మరి నోబెల్ బహుమతి కి ఎందుకు దరఖాస్తు చేసుకోలేదని సెటైర్
- చేతి వృత్తులని తెలంగాణ తరహాలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆదుకున్నారా
- తెలంగాణలో జరుగుతున్న సంక్షేమం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతోందా
- హైద్రాబాద్ లో బీసీలకు తెలంగాణ ఆత్మ గౌరవ భవనాలు నిర్మిస్తున్నట్టు ఢిల్లీలో ఆత్మ గౌరవ భవనాలు ఎందుకు కట్టడం లేదు
- రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు తమ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయని  బీజేపీ నేతలు చెప్పగలరా
- కుట్ర తోనే బీజేపీ మునుగోడు ఉప ఎన్నిక తెచ్చింది. అభివృద్ధి పేరు చెప్పి ఓట్లు అడిగే దమ్ము బీజేపీకి ఉందా 
- కాంగ్రెస్ కు తెలంగాణలో భారత్ జోడో యాత్ర ముఖ్యమా.. మునుగోడు ఉపఎన్నిక ముఖ్యమా
- మునుగోడులో ఏం జరిగినా.. ఆ పేరు చెప్పి తెలంగాణను ఆగం చేయాలని కుట్ర పన్నింది బీజేపీ. కనుక తెలంగాణ సమాజం బీజేపీ తీరును గమనించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.