Bird flu Alert in Telangana | హైదరాబాద్: కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకి భారీ సంఖ్యలో చనిపోవడంతో తెలంగాణలో అధికారులు అప్రమత్తం అయ్యారు. తెలంగాణ సరిహద్దుల్లో 24 చెక్‍పోస్ట్ లు ఏర్పాటు చేసి ఏపీ నుంచి కోళ్ల వాహనాలు రాకుండా అడ్డుకుంటున్నారు. ఉమ్నడి నల్గొండ జిల్లాలో మూడు చెక్‍పోస్టులు ఏర్పాటు చేసిన అధికారులు ఏపీ నుంచి తెలంగాణకు కోళ్ల లోడుతో వస్తున్న వాహనాలను వెనక్కి తిప్పి పంపుతున్నారు. కోళ్లకు సోకుతున్న బర్డ్ ఫ్లూ సమస్యపై పౌల్ట్రీ రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను మంత్రులు ఆదేశిస్తున్నారు.


హైదరాబాద్‌లో బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్ తో చికెన్ ధరలు సగానికి సగం దిగొచ్చాయి. నిన్న మొన్నటివరకు 280 నుంచి 320 మధ్య ఉన్న కేజీ చికెన్ ధర  రూ.150కి పడిపోయింది. కోళ్లకు వ్యాధి సోకి చనిపోతుండటం, మరోవైపు భయంతో ప్రజలు చికెన్ జోలికి వెళ్లకపోవడంతో విక్రయాలు సగానికి సగం పడిపోయాయి. హైదరాబాద్‌లో రోజుకు 6 లక్షల కేజీల చికెన్‌ అమ్మకాలు జరుగుతున్నాయి. కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకడం, ప్రభుత్వం సైతం ప్రజలను అలర్ట్ చేయడంతో చికెన్‌ వ్యాపారులు, అటు పౌల్ట్రీ నిర్వహించే రైతులు, వాటి యజమానులు ఆందోళన చెందుతున్నారు.


తూ.గో జిల్లాలో కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ  
ఏపీలో బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్లు చనిపోతున్నాయి. కొన్ని రోజుల కింద వైసీపీ నేతలు సైతం సోషల్ మీడియాలో దీనిపై పోస్టులు చేశారు. లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోతుండటం, ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని, అటు పౌల్ట్రీ రైతులకు, ఇటు చికెన్ తిని అస్వస్థతకు గురైతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లాలో కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది. పెరవలి మండలం కానూరులోని పౌల్ట్రీ నుంచి శాంపిల్స్ కు బర్డ్ ఫ్లూ పాజిటివ్ గా తేలడంతో ఏపీ అధికారులు అలర్ట్ అయ్యారు. రాజమండ్రి కలెక్టరేట్ లో టోల్ ఫ్రీ నెంబర్ 95429 08025 ఏర్పాటు చేశారు. కోళ్లు చనిపోతే అధికారులకు సమాచారం అందించాలని సూచిస్తూనే హై అలర్ట్ జారీ చేశారు. కొన్ని రోజులు చికెన్ తినకపోవడమే మంచిదని ప్రజలకు కలెక్టర్, అధికారులు సూచిస్తున్నారు.