Illegally set up sewerage connection of restaurant in Mehdipatnam : హైదరాబాద్: ఎలాంటి అనుమతి లేకుండా ఏర్పాటు చేసుకున్న రెస్టారెంట్ సీవరెజ్ కనెక్షన్ ను జలమండలి అధికారులు తొలగించారు. జలమండలి ఓ అండ్ ఎం డివిజన్-3 పరిధి మెహెదీపట్నంలోని కింగ్స్ రెస్టారెంట్ యజమానులు.. జలమండలి నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా 250 ఎంఎం డయా సీవరేజ్ పైపు లైన్ కనెక్షన్ తీసుకున్నారు. దీంతో పాటు ఆ రెస్టారెంట్ నుంచి వచ్చే అధిక సీవరేజ్ వల్ల మెయిన్ రోడ్ పై తరచూ సీవరేజ్ ఓవర్ ఫ్లో అవుతోంది. ఇటీవల ఎండీ అశోక్ రెడ్డి అక్కడ పర్యటించిన సమయంలో ఈ విషయం తేలడంతో ఆ రెస్టారెంట్ సీవరేజ్ కనెక్షన్ కట్ చేయాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు. దీంతో శనివారం నాడు సిబ్బంది వెళ్లి ఆ రెస్టారెంట్ సీవరేజ్ పైపు లైన్ కనెక్షన్ తొలగించారు.
సిల్ట్ చాంబర్లు ఏర్పాటు చేసుకోవాలి
అక్రమంగా నల్లా, సీవరేజ్ కనెక్షన్లు కలిగి ఉన్న వాళ్లు వాటిని క్రమబద్దీకరించుకోవాలని ఎండీ అశోక్ రెడ్డి వినియోగదారుల్ని విజ్ఞప్తి చేశారు. అలాగే ఆసుపత్రులు, హోటళ్లు, బేకరీలు, మాల్స్, తదితర వాణిజ్య, బహుళ అంతస్తు భవన సముదాయాల నిర్వాహకులు తప్పని సరిగా సిల్ట్ చాంబర్లు ఏర్పాటు చేసుకోవాలని పునరుద్ఘాటించారు.




ఈ నెంబర్లలో ఫిర్యాదు చేయవచ్చు
జలమండలి అధికారుల నుంచి అనుమతి లేకుండా ఎవరైనా అక్రమంగా తాగునీటి నల్లా, సీవరేజ్ పైపు లైన్ కనెక్షన్లు తీసుకుంటే.. క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. ఎవరైనా అక్రమ నల్లా, సీవరేజ్ కనెక్షన్లు గుర్తిస్తే.. జలమండలి విజిలెన్స్ బృందానికి 9989998100, 9989987135  ఫోన్ నంబర్ల ద్వారా సమాచారం ఇవ్వాలని సూచించారు.


Also Read: Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్ 


ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు


నగరంలో మరోవైపు ఫుడ్ సేఫ్టీ అధికారులు గత కొన్ని నెలలుగా ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. అపరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలు పాటించని రెస్టారెంట్లు, హోటళ్లు, ఫుడ్ కోర్టులపై కొరడా ఝులిపిస్తున్నారు. రంగు రావడానికి ఆహారంలో కలుపుతున్న రసాయనాలు ఉన్న కెమికల్స్ వాడుతున్న హోటల్స్, రెస్టారెంట్లపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కొన్నిచోట్ల క్వింటాళ్ల కొద్ది నిల్వ చేసిన కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టును సీజ్ చేసి తయారీదారులపై చర్యలు తీసుకున్నారు. నగరంలో నకిలీ టీ పొడి, కల్తీ పాలు, ప్లాస్టిక్ బియ్యం, ఐస్ క్రీమ్, చాక్లెట్లలో నాణ్యతా ప్రమాణాలు పాటించని వారితో పాటు ప్రభుత్వ శాఖల నుంచి అనుమతి లేకుండా నిర్వహిస్తున్న కంపెనీలపై కేసులు నమోదు చేసి నిర్వాహకులను ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటున్నారు.



కొన్ని రోజుల కిందట నగరంలో మయోనైజ్ ఉన్న మోమోస్ తిన్న ఓ మహిళ మృతి చెందగా, మరో 30 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఏడాది పాటు నగరంలో గుడ్డుతో తయారుచేసే మయోనైజ్ వాడకంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు నిషేధం విధించడం తెలిసిందే. నెలల తరబడి ఫ్రీజర్లలో దాచిపెట్టిన చికెన్, మటన్ క్వింటాళ్ల కొద్ది సీజ్ చేయడం నగర వాసులను ఆందోళనకు గురిచేసింది. బయట తినడం అంత సురక్షితం కాదని, సాధ్యమైనంత వరకు ఇంటి ఫుడ్ తీసుకోవాలని ప్రజలకు అధికారులు సూచించారు.