Last Day of Numaish: నెలన్నరపాటు హైదరాబాద్(Hyderabad) వాసులను అలరించిన నుమాయిష్(Numaish) గ్రాండ్ ఎగ్జిబిషన్ నేటితో ముగియనుంది. ఏటా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించే అతిపెద్ద అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన..భాగ్యనగరవాసులను ఎంతో ఆకట్టుంది. సుమారు 20 లక్షల మంది ఈసారి ఎగ్జిబిషన్ సందర్శించినట్లు తెలుస్తోంది. ఇంకా ఈ ఎగ్జిబిషన్ కు వెళ్లానుకుంటున్న వారు ఎవరైనా ఉన్నరా అయితే వెంటనే త్వరపడిండి. నేడే ఆఖరి రోజు..
నుమాయిష్ చివరి రోజు
భాగ్యనగరవాసులతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల వారు ఏడాదిపాటు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన నుమాయిష్(Numaish) ఎగ్జిబిషన్ కు నేడే చివరిరోజు. దాదాపు నెలన్నరపాటు నగరవాసులను అలరించినా...ఇలా వచ్చి అలా వెళ్లిపోయిందే అనిపిస్తోంది. ఏటా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానం(ExhibitionGround)లో ఈ అతిపెద్ద ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. అయితే వినియోగదారుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఈసారి మూడురోజులు పొడిగించారు. అసలే ఆదివారం, పైగా చివరిరోజు కావడంతో నుమాయిష్ కు జనం పోటెత్తారు. నిన్నటికే ఎగ్జిబిషన్ సందర్శించిన వారి సంఖ్య 20లక్షలు దాటిందని నిర్వాహకులు తెలిపారు. ఎగ్జిబిషన్ మైదానంలో దాదాపు 2400స్టాళ్లతో ఈసారి ఎగ్జిబిషన్ నిర్వహించారు.
ఘనంగా ముగింపు ఉత్సవాలు
నేటితో నుమాయిష్ ముగియనుండటంతో శనివారమే ఘనంగా ముగింపు ఉత్సవాలు నిర్వహించారు. నుమాయిష్‌కు సహకరించిన అధికారులు, స్టాల్ నిర్వాహకులు, ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విద్యాసంస్థలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థినులకు గోల్డ్ మెడల్, ప్రశంసాపత్రాలు, బహుమతులను ప్రదానం చేశారు.
ఘన చరిత్ర
నాంపల్లి గ్రౌండ్ లో నిర్వహించే అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శనశాలకు ఘనమైన చరిత్రే ఉంది. దాదాపు 8 దశాబ్దాల క్రితమే 1938లో ఏడో నిజాం ఉస్మాన్‌అలీ ఖాన్ చేతుల మీదుగా నుమాయిష్ ప్రారంభమైంది. మొదట 100 స్టాళ్లతో 10 రోజులపాటు జరిగిన ఈ ప్రదర్శన శాల 1946 వరకు పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించారు. తరువాత 10 రోజుల నుంచి 15 రోజుల వరకు పెంచారు. 1946లో హైదరాబాద్ అప్పటి ప్రధాని సర్ మీర్జా ఇస్మాయిల్ వేదికను నాంపల్లి గ్రౌండ్స్‌కు మార్చారు. స్వాంతత్ర్రం రావడం, హైదరాబాద్(Hyderabad) సంస్థానం విలీన గొడవలు దృష్ట్యా మధ్యలో రెండేళ్లు మినహా 1949లో నుంచి ఏటా ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఇది నెలన్నర రోజులకు పెరిగింది. స్టాళ్ల సంఖ్య సైతం ఏటా పెరుగుతూ 2600 స్టాళ్లకు చేరుకున్నాయి.
చిన్నలు, పెద్దలు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కావాల్సిన అన్ని వస్తువులు ఇక్కడ దొరుకుతాయి. నేరుగా వివిధ కంపెనీలే తమ వస్తువులు ప్రదర్శించడానికి ఇక్కడ స్టాళ్లు ఏర్పాటు చేస్తారు. దీంతో నాణ్యమైన వస్తువులు ఇక్కడ దొరుకుతాయని ప్రతీతి. ఈ ప్రదర్శన జరిగినన్నాళ్లు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది. అలాగే మెట్రో రైళ్లకు సైతం అదనపు సమయం కేటాయించారు. హైదరాబాద్ లో నిర్వహించే నుమాయిష్ కు దేశవ్యాప్తంగా ఎంతో పేరు ఉంది. ఎలాంటి ఆటంకం లేకుండా ప్రదర్శన నిర్వహించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ కట్టుదిట్టుమైన ఏర్పాట్లు చేస్తుంది. ఈ సొసైటీకి నగరంలోని పురపాలక శాఖ, నీటిపారుదల శాఖ, రోడ్డు భవనాల శాఖ, ట్రాఫిల్ పోలీస్ శాఖ మొదలగు శాఖలు సహకరిస్తాయి.