Fire Accident at CC Camera Dodown in Koti: హైదరాబాద్: నగరంలోని కోఠి మార్కెట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. కోఠి గుజరాతీ గల్లీలోని జె ఎం డి ఎలక్ట్రానిక్స్ కి చెందిన సిసి కెమెరా గోదాంలో శనివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. అభిషేక్ అగర్వాల్ అనే వ్యక్తి జెడి ఎలక్ట్రానిక్స్ పేరుతో అదే గల్లీ సిసి కెమెరాల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ కెమెరాల కు సంబందించిన స్టోరేజ్ గోదాం ను దుకాణానికి సమీపంలో ఉన్న రెసిడెన్షియల్ బిల్డింగ్ లోని మొదటి అంతస్తులోఈ ప్రమాదం జరిగింది. సమయానికి గోదాం లో ఎవరు లేకపోవడం తో ప్రమాదం తప్పింది.
రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో గోదాం షేటర్ నుండి బయటకు పొగలు రావడంతో... అదే భవనంలో నివాసం ఉంటున్న స్థానికులు గమనించి వెంటనే సుల్తాన్ బజార్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు గోదాం వద్దకు చేరుకొని షటర్లను పగలగొట్టి, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న రెండు ఫైరింజన్ ల సహాయంతో మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో 20 నుంచి 25 లక్షల రూపాయలు విలువ చేసే సిసి కెమెరాలు అగ్నికి ఆహుతయ్యాయని ప్రాథమికంగా భావిస్తున్నారు.