Numaish Exhibition At Nampally Ground: నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో 49 రోజులుగా జరిగిన నుమాయిష్‌ (Numaish Exhibition) ఆదివారంతో ముగిసింది. దాదాపు 24 లక్షల మంది సందర్శకులు ఈ ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. చివరి రోజు దాదాపు 80 వేల మందిపైగా పైగా వచ్చారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సొసైటీ ఉపాధ్యక్షుడు వనం సత్యేందర్‌, కార్యదర్శి హనుమంతరావు, సంయుక్త కార్యదర్శి చంద్రజిత్‌సింగ్‌, కోశాధికారి ఏనుగుల రాజేందర్‌కుమార్‌ నేతృత్వంలో ప్రతినిధులు అన్ని చర్యలు తీసుకున్నారు.


శనివారం ముగింపు ఉత్సవాలు
ఈ ఏడాది స్టాల్‌ నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడు, మంత్రి శ్రీధర్‌బాబు నుమాయిష్‌ను మూడు రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే శనివారం అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. నుమాయిష్‌కు సహకరించిన అధికారులు, స్టాల్‌ నిర్వాహకులు, ఎగ్జిబిషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విద్యాసంస్థలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థినులకు గోల్డ్‌ మెడల్‌, ప్రశంసాపత్రాలు, బహుమతులను ప్రదానం చేశారు.


2400 స్టాళ్ల ఏర్పాటు
ఎగ్జిబిషన్‌ మైదానంలో దాదాపు 2400 వరకు స్టాళ్లతో ఏటా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 45 రోజుల పాటు ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది 49 రోజలు నిర్వహించారు. ఈసారి ఎగ్జిబిషన్ టికెట్ ధర రూ. 40 గా నిర్ణయించారు. అలాగే ఎగ్జిబిషన్‌ లోపల వాహనాలతో సందర్శించే ఏర్పాట్లు కూడా చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రత్యేక వసూలు చేసి వాహనాలను అనుమతించారు. గతంలో ఇందు కోసం రూ.600 వసూలు చేశారు. సాధారణ సందర్శకులను ప్రతి రోజూ సాయంత్రం 3.30 నుంచి రాత్రి 10.30 వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోకి అనుమతించారు. 


ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు
నుమాయిష్ ఎగ్జిబిషన్‌ను దృష్టిలో పెట్టుకొని టీఎస్ ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడిపింది. నాంపల్లి, గాంధీభవన్ మెట్రో ష్టేషన్లు ఎగ్జిబిషన్ మైదానానికి సమీపంగా ఉన్నాయి. నుమాయిష్‌ను దృష్టిలో ఉంచుకొని మియాపూర్ - ఎల్బీనగర్, నాగోల్- రాయదుర్గం మార్గాల్లో  ప్రత్యేకంగా మెట్రో రైళ్లను నడిపారు. అంతేకాదు మెట్రో రైల్ కోసం స్పెషల్ టికెట్ కౌంటర్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఎగ్జిబిషన్‌ సాఫీగా సాగేందుకు నిర్వాహకులు పలు సబ్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. ఎక్కడా ఇబ్బంది రాకుండా కమిటీల ద్వారా అనేక కార్యక్రమాలను నిర్వహించారు. 


1983లో తొలిసారి..
పబ్లిక్‌ గార్డెన్స్‌లో 1983లో మొదటి సారి నుమాయిష్ జరిగింది. ఆ సమయంలో వంద స్టాళ్లతో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. క్రమక్రమంగా ప్రజాదరణ పొందతూ నేడు 2400 స్టాళ్లకు చేరుకుంది. ఈ వేడుకల కోసం తెలంగాణ నలుమూలల నుంచి ప్రజలు వస్తారు. నుమాయిష్‌ నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయంతో ఎగ్జిబిషన్‌ సొసైటీ వర్గాలు తెలంగాణ జిల్లాలో వెనుకబడిన ప్రాంతాల్లో కళాశాలలను ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి పాటుపడుతున్నాయి.