NTR Century Celebrations: తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ శత జయంత్యుత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ లో ఏర్పాటు చేసిన మినీ మహానాడు, ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు నటుడు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ పేరు చెప్పగానే ప్రతి తెలుగు వ్యక్తి గుండె పొగరుతో నినదిస్తుందని బాలకృష్ణ అన్నారు. నందమూరి కుటుంబం, రెండు తెలుగు రాష్ట్రాల అభిమానుల తరఫున దివంగత ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. సామాన్య ప్రజల కోసం సాహసోపేతమైన పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. ఎందరో రాజకీయ నేతలకు మంచి మంచి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారని పేర్కొన్నారు. టీడీపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని బాలకృష్ణ హామీ ఇచ్చారు.


మన దేశంలో సామాజిక విప్లవం తీసుకొచ్చారని వెల్లడించారు. మండల వ్యవస్థ, మహిళా యూనివర్సిటీ, వెనుకబడిన సామాజిక వర్గాలు వారికి రిజర్వేషన్లు పెంచారని తెలిపారు. ఇలా ఎన్టీఆర్ తీసుకొచ్చిన పథకాలు, హైదరాబాద్ లో ఆయన హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. అంతేకాకుండా తెలుగు యువత ఏపీ, తెలంగాణ ప్రజలు సొంత అన్నదమ్ములుగా కలిసి ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, నందమూరి సుహాసిని, గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ అరవింద్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.