NTR Centenary Celebrations at KPHB On May 20th in Hyderabad:
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, దివంగత నేత ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకొని ‘ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్‌సైట్ కమిటీ’ మే 20న సాయంత్రం 5గంటలకు హైదరాబాద్, కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులోని కైతలాపూర్ మైదానంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వేడులకలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారు. ప్రముఖ సినీ నటడు నందమూరి బాలకృష్ణ ప్రత్యేక అతిథిగా పాల్గొంటున్నారు.
ఈ వేడుకలలో భాగంగా ఎన్టీఆర్ సమగ్ర సినీ, రాజకీయ జీవితంలో ఆయనతో సన్నిహితంగా మెలిగిన సహచర నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, దర్శకులు, పాత్రికేయులు, సహచర రాజకీయ నాయకులు, వివిధ పార్టీల నేతలు, ఎడిటర్లు వెలిబుచ్చిన అభిప్రాయాలు, ప్రత్యేకంగా రాసిన వ్యాసాలను సంకలనం చేసిన ‘శక పురుషుడు’ ప్రత్యేక సావనీర్‌ను, అదేవిధంగా ఎన్టీఆర్ సమగ్ర జీవితానికి సంబంధించిన విశేషాలు, సినీ పాటలు, సినిమాలు, ఉపన్యాసాలు తదితర పూర్తి సమాచారంతో రూపొందించిన ‘జై ఎన్టీఆర్’ వెబ్‌సైట్ ఆవిష్కరించనున్నారు.
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ.. రేపు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొంటారు. ఎన్టీఆర్ ప్రజలకు చేసిన సేవలును గుర్తు చేసుకుందాం. ఎన్టీఆర్ లో దేవుడి రూపంలో చూశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ... ప్రాంతాలు వేరైనా తెలుగు ప్రజలందరూ ఒక్కటే. ఎన్టీర్ శతజయంతి ఉత్సవాలకు అందరూ ఆహ్వానితులే. ఎన్టీఆర్ అందరివాడు. ప్రాంతాలకు అతీతంగా ఎన్టీఆర్ కు అందరూ అభిమానులే. నటుడిగా ఉంటూనే ప్రజలకు ఎంతో సేవ చేశారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం అన్నారు ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్‌సైట్ కమిటీ ఛైర్మన్ టీడీ జనార్దన్. సూర్య చంద్రులు ఉన్నంతవరకు ఎన్టీఆర్ పేరు నిలిచి ఉంటుంది. ఎన్టీఆర్ చరిత్ర గురించి ప్రత్యేక వెబ్ సైట్ రూపొందించాం. 500 పేజీల ప్రత్యేక సావనీర్ ఆవిష్కరించనున్నాం అన్నారు. ఎన్టీఆర్ పేరుతో ప్రత్యేక యాప్ ను లోకేష్ ఆవిష్కరిస్తారని తెలిపారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించనున్నాం. టిడిపి ప్రముఖులను సత్కరించనున్నామని చెప్పారు.
కాగా, ఈ వేడుకలలో ప్రముఖ సినీ, రాజకీయ నాయకులు పాల్గొంటున్నారు. ‘గెస్ట్స్ ఆఫ్ ఆనర్’గా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా, సీపీఎం జాతీయ సెక్రటరీ సీతారామ్ ఏచూరి, బీజేపీ జాతీయ నేత పురందీశ్వరి, టిటిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, కన్నడ చిత్ర హీరో శివకుమార్ హాజరుకానున్నారు. టాలీవుడ్ నుంచి ప్రముఖ హీరోలు చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు వ్యక్తిగత కారణాలు, బిజీ షెడ్యూల్ కారణంగా ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని సమాచారం.
ప్రముఖ తెలుగు హీరోలు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, దగ్గుబాటి వెంకటేష్, సుమన్, మురళీమోహన్, నందమూరి కళ్యాణ్‌రామ్, ప్రముఖ హీరోయిన్, మాజీ పార్లమెంట్ సభ్యులు జయప్రద, ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు, ప్రముఖ నిర్మాతలు జి. ఆదిశేషగిరి రావు, సి. అశ్వనీదత్, ఇతర సినీ, రాజకీయ ప్రముఖులు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో సావనీర్, వెబ్‌సైట్‌ల ఆవిష్కరణలతోపాట పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. పలువురు ప్రముఖులకు కమిటి పురస్కారాలు అందిస్తుంది.