Telangana News: తెలంగాణలో సంచలనం రేపుతున్న మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయనతో పాటు మరికొంతమందిపై  పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నాన్ బెయిలబుల్  కేసు నమోదైంది. ప్రణీత్ రావుతో పాటు ఫోన్ ట్యాపింగ్, హార్డ్ డిస్క్‌లు ధ్వంసం చేయడంలో అతడికి సహకరించిన అధికారులపై ipc 409, 427, 201, 120(బీ), pdpp ఆక్ట్, ఐటీ యాక్ట్ కింద పంజాగుట్ట పోలీసులు (Panjagutta Police) ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతి రోజు డిసెంబర్ 4న రాత్రి పంజాగుట్టలోని ఎస్ఐబీ కార్యాలయంలో హార్డ్ డిస్కులతో పాటు కంప్యూటర్లు ప్రణీత్ రావు కాల్చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్కడ ప్రత్యేకంగా 17 సిస్టమ్స్ ఏర్పాటు చేసుకుని రాజకీయ నేత ఫోన్లు ట్రాప్ చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అనధికారికంగా ప్రజాప్రతినిధుల ఫోన్లు ట్యాపింగ్ చేయడం ద్వారా రహస్య సమాచారం సేకరించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్‌ఐబీ అధికారాలను దుర్వినియోగం చేశారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.


సీసీ కెమెరాలు ఆఫ్ చేసి మరీ..


ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రోజే తన వద్ద ఉన్న సమాచారం మొత్తం ఇతర  హార్డ్ డిస్కులలోకి ప్రణీత్ రావు మార్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాలు ఆఫ్ చేసి సాక్ష్యాలు తారుమారు చేసినట్లు ఎస్‌ఐబీ అధికారులకు ఆధారాలు లభ్యమయ్యాయి. దీనిపై ఎస్ఐబీ అదనపు ఎస్పీ డీ.రమేష్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేపడుతున్నారు. ప్రభుత్వం మారడంతోనే ప్రణీత్ రావు రికార్డులు ధ్వంసం చేశాడని,  42 హార్డ్ డిస్క్‌ల్లోని కీలక సమాచారాన్నిరిమూవ్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఎస్‌ఐబీ లాగర్ రూమ్‌లోని ల్యాప్టాప్, హార్డ్ డిస్క్‌లతో పాటు ఫోన్ టాపింగ్ డేటా, ఫోన్ ఐఎమ్‌ఈఐ నెంబర్లు, కాల్ డేటా రికార్డ్ లాంటి వివరాలను సైతం ధ్వంసం చేసినట్లు తేలింది. అలాగే డేటా బేస్‌లో ఉన్న డేటాను మొత్తం రిమూవ్ చేసినట్లు అధికారులు గుర్తించారు.


ప్రణీత్ రావు సస్పెండ్


హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేశాడనే ఆరోపణల క్రమంలో ప్రణీత్ రావును ఇప్పటికే డీజీపీ సస్పెండ్ చేశారు. కేంద్ర హోంశాఖ అనుమతి లేకుండా ప్రజాప్రతినిధుల ఫోన్లను అనధికారికంగా ట్యాప్ చేయడం చట్ట విరుద్దమని, అందుకే సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ప్రణీత్ రావు వ్యవహారంపై సీరియస్ అయిన ప్రభుత్వం.. వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఈ క్రమంలో గత ప్రభుత్వ హాయంలో ప్రతిపక్ష నేతల ఫోన్లను ప్రణీత్ రావు ట్యాప్ చేశాడని, ప్రభుత్వం మారడంతో వెంటనే డేటాను డిలీట్ చేసినట్లు తేలింది.  పంజాగుట్టలోని ఎస్‌ఐబీ కార్యాలయంలోని రెండు గదులను వినియోగించుకుని అనధికారికంగా కంప్యూటర్లను వాడుకున్నాడని తేలింది. ఈ కంప్యూటర్ల కోసం ప్రత్యేకంగా ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు చేసుకుని కొంతమంది వ్యక్తుల పేరిట ప్రొఫైల్‌లు తయారుచేసినట్లు దర్యాప్తులో బయటడింది.


బంధువు అండదండలు


సస్పెండ్ కావడంతో ప్రస్తుతం ప్రణీత్ రావు సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో ఉన్నారు. అయితే మాజీ ఐపీఎస్, మాజీ ఇంటెలిజెన్స్ ప్రభాకర్ రావు అండ చూసుకునే ప్రణీత్ రావు అనధికార కార్యక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభాకర్ రావు తన బంధువు కావడంతో ఆయన అండతోనే ఇలా చేశారనే విమర్శలు వస్తున్నాయి.