నిజామాబాద్‌లో ఐటీ హబ్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు అయింది. ఐటీ హబ్ ను ఆగస్టు 9న ప్రారంభిస్తామని ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. ఇప్పటికే ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలిపారు. సోమవారం (ఆగస్టు 7) కవిత నిజామాబాద్ ఐటీ హబ్‌ను సందర్శించారు. స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా, ఆర్టీసీ ఛైర‌్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ కూడా ఆమె వెంట ఉన్నారు. అనంతరం కవిత స్థానిక విలేకరులతో మాట్లాడారు.


ఈ సందర్భంగా కవిత కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ఆ రావడం కూడా కాంగ్రెస్ పార్టీ​ విజయమే అని కాంగ్రెస్ నేతలు అనేలా ఉన్నారని ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కూడా వివాదం చేస్తుందని అన్నారు. ఆ మధ్య కొత్తగా సెక్రటేరియట్ కడుతుండగా కూడా ఆ నిర్మాణం నేలమాళిగలు, గుప్త నిధుల కోసమే చేస్తున్నారని ఆరోపణలు చేశారని గుర్తు చేశారు.


ఐటీ హబ్ గురించి మాట్లాడుతూ.. 750 మంది పని చేసే సామర్థ్యంతో ఈ భవనాన్ని నిర్మించారని చెప్పారు. ఇక్కడి నుంచి పని చేయడానికి ఇప్పటికే 15 కంపెనీలతో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. ఇటీవల జిల్లాలో నిర్వహించిన ఉద్యోగ మేళాలో 280 మందికి ఆ కంపెనీలు ఆఫర్ లెటర్లు కూడా ఇచ్చాయని చెప్పారు. ఇప్పటికే 200 మంది ఉద్యోగాల్లో చేరేందుకు రెడీగా ఉన్నారని అన్నారు. దివ్యాంగులకు ఇక్కడి ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వ్ ఉంటుందని చెప్పారు. 


టాస్క్‌ (Telangana Academy for Skill and Knowledge) ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, అందులో భాగంగా నిజామాబాద్‌లో ప్రతి నెలా ఒక జాబ్ మేళా ఉండేలా చూస్తామని అన్నారు. ఈ నెల 29న మరో జాబ్ మేళా ఉంటుందని అన్నారు. అమెజాన్, హెచ్‌డీఎఫ్‌సీ, గూగుల్, టెక్ మహీంద్రా, ఐబీఎం వంటి 52 అంతర్జాతీయ కంపెనీలు మేళాకు వస్తున్నాయని.. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు.


నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ ఈ నెల 9న రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ఈ ఐటీ హబ్‌ను, మున్సిపల్ భవనాన్ని, మినీ ట్యాంక్ బండ్‌ను, వైకుంఠ థామాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. ఆ రోజు నగరంలోని శ్రీరామ గార్డెన్ లో మున్సిపల్ కార్మికులతో సహ ఫంక్తి భోజనం చేస్తారని అన్నారు. పాలిటెక్నిక్ మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని అన్నారు.