గద్దర్ అంత్యక్రియల్లో అభిమానులను కట్టడి చేయకపోవడంతో అపశ్రుతి చోటు చేసుకుంది. అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఓ వ్యక్తి మృతి చెందారు. ఆయనను సియాసత్ వార్తాసంస్థ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ గా గుర్తించారు. ఈయన గద్దర్‌కు సన్నిహితుడుగా ఉండేవారని చెబుతున్నారు. గద్దర్ ఇంటి వద్ద జహీరుద్దీన్ అలీఖాన్ కు గుండెపోటు వచ్చి కింద పడిపోయినట్లుగా భావిస్తున్నారు. పడిపోయిన జహీరుద్దీన్ అలీ ఖాన్‌ను స్థానికులు పక్కనే ఉన్న ప్రథమ చికిత్స కేంద్రానికి తీసుకెళ్లగా అప్పటికే ఆయన చనిపోయినట్లుగా డాక్టర్ వెల్లడించినట్లుగా సమాచారం.


ఆదివారం (ఆగస్టు 6) ఉదయం జరిగిన విద్యావంతుల వేదిక సదస్సులో కూడా జహీరుద్దీన్ అలీ ఖాన్ చురుగ్గా పాల్గొన్నారు. గద్దర్ చనిపోయారని తెలుసుకున్న జహీర్ వెంటనే అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. అప్పటి నుంచి గద్దర్ అంత్యక్రియలు ముగిసే వరకూ అక్కడే ఉన్నారు. ఎల్బీ స్టేడియం నుంచి మొదలైన అంతిమయాత్ర వెంట కూడా ఆయన ఉన్నారు. అయితే మహాబోధి స్కూల్ ప్రాంగణం జనాలతో విపరీతంగా నిండిపోవడం, పోలీసులు ఎంత అదుపు చేయడానికి ప్రయత్నించినా తొక్కిసలాట ఘటనలు చోటు చేసుకున్నాయి. అంతటి తీవ్ర ఒత్తిడిలో జహీరుద్దీన్ అలీ ఖాన్ ఊపిరాడక సొమ్మసిల్లి కిందపడిపోయినట్లు తెలుస్తోంది. గుండెపోటు రావడం వల్ల ఆయన పడిపోయారని కూడా అంటున్నారు. వెంటనే అక్కడి వారు సీపీఆర్ చేయడానికి ప్రయత్నించారు. అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయారు.


మహాబోధి విద్యాలయంలో వెనుకాల గ్రౌండ్ లో గద్దర్ అంత్యక్రియలు జరుగుతున్నాయి. ప్రాంగణంలోకి వెళ్లడానికి జనం గేటు ఎక్కే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు కట్టడి చేసే ప్రయత్నం చేశారు. దీంతో మహాబోధి విద్యాలయంలో ముందు ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. గేటు లోపలికి వెళ్లేందుకు తోపులాట చోటు చేసుకుంది.


ముగిసిన అంత్యక్రియలు


ప్రజాగాయకుడు గద్దర్ (గుమ్మడి విఠల్ రావు) అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్ అల్వాల్‌లోని మహాభోది స్కూల్ ప్రాంగణంలో గద్దర్ భౌతిక కాయాన్ని ఖననం చేశారు. కుటుంబ సభ్యులు, అభిమానుల అశ్రునయనాల మధ్య గద్దర్ అంత్యక్రియలు జరిగాయి. బౌద్ధ సాంప్రదాయం ప్రకారం ఆయన అంత్యక్రియలు జరిగాయి. మహాబోధి స్కూల్ ప్రాంగణానికి వివిధ రాజకీయప్రముఖులు, మంత్రులు, విపక్ష నేతలతోపాటు, సినీ రంగం నుంచి ఆర్ నారాయణ మూర్తి తదితరులు హాజరు అయ్యారు. అంత్యక్రియల సమయంలో కళాకారులు ప్రార్థన చేస్తూ గద్దర్ కు నివాళి అర్పించారు.