ప్రజా గాయకుడైన గద్దర్ హఠాన్మరణం చెందడం తీరని లోటు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయన తెలంగాణ సమాజానికి ఎంతగానో ఉపయోగపడ్డారని గుర్తు చేశారు. గద్దర్ ఓ గొప్ప వ్యక్తి అని, ప్రజా యుద్ధ నౌక అని అభివర్ణించారు. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉండి కూడా ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఉన్నారని అన్నారు. కోట్లాది ప్రజల అభిమానాన్ని చూరగొన్న గద్దర్ మరణించడం బాధాకరమని అన్నారు. అలాంటి వ్యక్తి అయిన గద్దర్ చనిపోతే, నిన్నటి నుంచి పొలిటికల్ డ్రామాలు నడుస్తున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు.
గద్దర్ భౌతిక కాయాన్ని సందర్శించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తలసాని సోమవారం (ఆగస్టు 7) మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ.. జి.కిషన్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేశారు. చిల్లర రాజకీయాలు చేయవద్దని.. ప్రభుత్వం అధికార లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు నిర్వహిస్తుందని అన్నారు. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ.. కొద్దిమంది అన్నీ తామే చేస్తున్నామని చెప్పుకుంటున్నారని అన్నారు. లాల్ బహదూర్ స్టేడియం కూడా వాళ్లే ఏర్పాటు చేశారని చెప్పుకుంటున్నారని అన్నారు. చిల్లర రాజకీయాలు మాట్లాడటం మానుకోవాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు.
కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ఇవీ
కిషన్ రెడ్డి కూడా ఎల్బీ స్టేడియంలో గద్దర్ భౌతిక కాయానికి నివాళి అర్పించారు. తెలంగాణలో పూర్తిగా అనుకున్న ఆశయాలు నెరవేకుండానే గద్దర్ లోకాన్ని విడిచిపోయారని అన్నారు. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా రాష్ట్రంలో ఇబ్బందులు అలానే ఉన్నాయని గద్దర్ భావించేవారని చెప్పారు. అందులో భాగంగానే ఎన్నికల్లో పోటీ చేస్తానని గద్దర్ తనతో చెప్పారని గుర్తు చేసుకున్నారు. గద్దర్ ఉహించిన తెలంగాణ రాలేదని చాలా బాధ పడ్డారని కిషన్ రెడ్డి అన్నారు. నిజానికి చాలా సందర్భాల్లో గద్దర్ సైతం ఈ విషయం గురించి మాట్లాడేవారని కిషన్ రెడ్డి అన్నారు.
ఎల్బీ స్టేడియానికి రేవంత్ చొరవ చూపారని వార్తలు
నిన్న మధ్యాహ్నం గద్దర్ భౌతిక కాయం అపోలో ఆసుపత్రి నుంచి ఎక్కడికి తరలించాలనే దానిపై ఓ సందర్భంలో గందరగోళం ఏర్పడింది. అల్వాల్‌లోని సొంతింటికి తీసుకెళ్లాలని భావించగా, తగిన స్థలం లేకపోవడంతో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌కు తీసుకెళ్లాలని అనుకున్నారు. ఇంతలో గద్దర్ కు ఎంతో ఇష్టమైన నిజాం కాలేజీ గ్రౌండ్‌కు తీసుకెళ్తే బాగుంటుందని కొందరు కళాకారులు సూచించారు. అక్కడా స్థలం సరిపోదని, జనాన్ని అదుపు చేయడం కష్టమనే ఉద్దేశంతో ఎల్బీ స్టేడియానికి తీసుకెళ్లాలని కాంగ్రెస్ పెద్దలు సూచించినట్లు తెలిసింది. సాయంత్రం 5.30కు స్టేడియానికి తీసుకురాగా గద్దర్ భౌతిక కాయాన్ని ఉంచేందుకు ప్రభుత్వం అంగీకరించ లేదని వార్తలు వచ్చాయి. రేవంత్ రెడ్డి చొరవ చూపి స్టేడియం గేట్లు తీసుకుని లోపలకు వెళ్లి ఏర్పాట్లు చేశారని కొన్ని మీడియా సంస్థలు కథనాలు రాశాయి.
ఇక వాగ్గేయకారుడు గద్దర్ మరణంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గద్దర్ ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక పోతున్నామని, ఇటీవల జరిగిన ఖమ్మంలో జనగర్జన సభలో గద్దర్ రాహుల్ గాంధీతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారని గుర్తు చేసుకున్నారు. గాంధీల కుటుంబం పట్ల గద్దర్ కు అభిమానం ఎక్కువని రేవంత్ రెడ్డి చెప్పారు.
కాసేపట్లో అల్వాల్ కు సీఎం కేసీఆర్
గద్దర్ భౌతిక కాయానికి నివాళి అర్పించడానికి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడానికి సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. అల్వాల్ వెంకటాపురం భూదేవి నగర్ లోని గద్దర్ ఇంటికి ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో వెళ్లనున్నారు. ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.