ప్రజా గాయకుడు, వాగ్గేయకారుడు గద్దర్ భౌతిక కాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళి అర్పించారు. ఇందుకోసం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి ఆల్వాల్ లోని గద్దర్ ఇంటికి వెళ్లారు. ఆయన భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం గద్దర్ కుటుంబ సభ్యులను కేసీఆర్ కలిసి పరామర్శించారు. అల్వాల్‌లోని గ‌ద్దర్ ఇంటికి సోమ‌వారం సాయంత్రం (ఆగస్టు 7) కేసీఆర్ చేరుకున్నారు. సీఎంతో పాటు మంత్రులు హ‌రీశ్‌రావు, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ గోరెటి వెంక‌న్న ఇతర బీఆర్ఎస్ నాయ‌కులు ఉన్నారు. వారు కూడా గద్దర్ భౌతిక కాయానికి నివాళి అర్పించారు.


అంత్యక్రియలు ఇక్కడే


గద్దర్ అంత్యక్రియలకు అల్వాల్‌లోని మహాభోది స్కూల్ గ్రౌండ్స్‌లో అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయన భౌతిక కాయాన్ని ఖననం చేయనున్నారు. పోలీసులు స్కూల్ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతున్నందున పోలీసులు రిహార్సల్ చేశారు.


అంతకుముందు గద్దర్ భౌతిక కాయం ఎల్బీ స్టేడియంలో ఉంచిన సంగతి తెలిసిందే. ప్రముఖులతో పాటు ఆయన అభిమానులు, కళాకారులు చాలా మంది అక్కడే నివాళి అర్పించారు. ఎల్బీ స్టేడియం నుంచి గద్దర్‌ అంతిమ యాత్ర మధ్యాహ్నం ప్రారంభం అయింది. ఆ యాత్ర గన్‌పార్క్‌, అసెంబ్లీ, నెక్లెస్‌ రోడ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం, అమరవీరుల స్మారక స్తూపం, ట్యాంక్‌ బండ్‌, జూబ్లీబస్ స్టేషన్, తిరుమలగిరి మీదుగా అల్వాల్‌‌కు చేరనుంది. గద్దర్‌ ఇంటి వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చిన జనాన్ని నియంత్రించారు.