హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినతరం కాబోతున్నాయి. హెల్మెట్ లేకపోయినా, సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా, బండిపై ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్నా, రాంగ్ రూట్ లో వెళ్తున్నా.. ఇప్పటికే పోలీసులు భారీ జరిమానాలు విధిస్తున్నారు. అయినా కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు. ఎన్ని జరిమానాలు విధించినా.. కొందరు తీరు మార్చుకోవడం లేదు. వేల రూపాయలు ఛలానాలు పడుతున్నా.. వేలకు వేలు జరిమానా విధిస్తున్నా.. అవి కట్టకుండా పోలీసుల కంట పడకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఎక్కడైనా పోలీసులకు దొరికితే కానీ ఆ వాహనంపై వేల రూపాయలు జరిమానా ఉన్నట్లు గుర్తించలేక పోతున్నారు.
3 నెలల్లో 3 సార్లు అతిక్రమిస్తే ఇక అంతే..
అందుకే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరింత కఠినమైన నిబంధనలు తీసుకువచ్చే చర్యలు చేపట్టారు. దీని వల్ల అయినా వాహనదారుల్లో నిబంధనలు అతిక్రమించ వద్దు అన్న భయం పెరుగుతుందని పోలీసులు భావిస్తున్నారు. కొత్త రూల్ ప్రకారం హైదరాబాద్ నగర పరిధిలో 3 నెలల వ్యవధిలో 3 సార్లు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే జేబుకు భారీగా చిల్లు పెట్టే పనిలో ఉన్నారు ట్రాఫిక్ పోలీసులు.
ఇప్పటి వరకు హెల్మెట్ లేకుండా దొరికితే రూ. 100 జరిమానాగా విధిస్తున్నారు. మరో రూ. 35 ఛార్జీలుగా వసూలు చేస్తున్నారు. అంటే హెల్మెట్ లేకుండా పట్టుబడితే మొత్తం రూ. 135 కట్టాల్సి వస్తోంది. ఇక కొత్త నిబంధనల ప్రకారం.. హెల్మెట్ లేకుండా మొదటి సారి దొరికితే రూ. 100 జరిమానా విధిస్తారు. ఇక రెండోసారి కూడా హెల్మెట్ లేకుండా పట్టుబడితే రూ. 200 ఛలానా వేస్తారు. మూడోసారి కూడా హెల్మెట్ లేకుండా దొరికితే ఏకంగా రూ. 500 ఫైన్ విధిస్తారు. అంటే హెల్మెట్ లేకుండా మూడు సార్లు దొరికితే మూడోసారి ఏకంగా 400 శాతం అదనంగా జరిమానా విధిస్తారు. ఏటా నమోదు అవుతున్న ట్రాఫిక్ ఉల్లంఘన కేసులకు కళ్లెం వేసేలా, వాహనదారుల్లో చైతన్యం తీసుకు రావడం కోసం కఠినంగా వ్యవహరిస్తున్నామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.
కఠినమైన రూల్స్ ఉన్నా.. అతిక్రమిస్తూనే ఉన్నారు..!
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల్లో ద్విచక్ర వాహనదారులవే ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అందులోనూ హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారు కోకొల్లలు. రోజూ వందల మంది హెల్మెట్ లేకుండా పట్టుబడుతున్నారు. వారిపై ట్రాఫిక్ పోలీసులు, సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తించి జరిమానా విధిస్తున్నారు. అయితే ట్రాఫిక్ నిబంధనలు ఎంత కఠినంగా విధిస్తున్నా.. ఉల్లంఘనలు మాత్రం తగ్గడం లేదని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. వాహనదారుల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు. ఈ కొత్త జరిమానాలు గత వారం రోజులుగా విధిస్తున్నారు. ఇప్పటి వరకు 50 వేల మంది వాహనదారులపై ఇప్పటికే జరిమానా విధించారు. మొదటిసారి హెల్మెట్ లేకుండా దొరికితే విధించిన ఛలానాను సకాలంలో చెల్లించిన వారికి రూ. 500 జరిమానా విధిస్తున్నారు.