Nampally Fire Accident News: 9మందిని బలితీసుకున్న నాంపల్లి (Nampally) బజార్‌ఘాట్ అగ్నిప్రమాద ఘటన (Fire Accident)లో భవన యజమాని జైస్వాల్ (Ramesh Jaiswal)పై మూడు సెక్షన్లు 304, 285, 286 కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. అయితే... ప్రమాదం జరిగిన వెంటనే ఆయన ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. లక్డీకపూల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. రమేష్ జైస్వాల్ ఆస్పత్రిలో ఉన్నట్టు ఆయన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో... ఆయన డిశార్జ్ కాగానే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు.
హైదరాబాద్ నాంపల్లిలోని బజార్‌ఘాట్‌లోని అపార్ట్‌మెంట్‌లో నిన్న (సోమవారం) ఉదయం 9గంటల 30నిమిషాలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 9మంది మృతిచెందారు. భవనం కింది భాగంలో... డ్రమ్ముల్లో కెమికల్స్ నిల్వచేశారు. వాటికి మంటలు అంటుకోవడంతో ప్రమాదం జరిగింది. కెమికల్స్ డ్రమ్ములకు మంటలు అంటుకున్న మంటలు... క్షణాల్లోనే ఎగిపడ్డాయి. భవనం మొత్తం వ్యాపించాయి. భవనంపై ఉన్న ఫ్లాట్లలో కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయి. ఐదో అంతస్తు వరకు మంటలు వ్యాపించాయి. మంటల్లో చిక్కుకున్న వారిలో చిన్నారి సహా 9మంది సజీవ దహనమయ్యారు. పలువురు గాయపడ్డారు. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మృతులు మూడు కుటుంబాలకు చెందిన వారని అధికారులు తెలిపారు. వారు... ఎండీ ఆజం (57), అతని భార్య రెహ్మాన్ సుల్తానా (50), వారి పిల్లలు హసీబ్ (32), ఫైజా సమీనా (26), తహురా ఫర్హీన్ (35), ఆమె పిల్లలు తరోబా (13), మన్హ (6)గా గుర్తించారు. అలాగే... దంపతులు జాకీర్ హుస్సేన్ (66), నిఖత్ సుల్తానా(50) మృతిచెందారు. 21 మందికి ప్రమాదం నుంచి రక్షించారు.
ఇంటి సెల్లార్‌లో అక్రమంగా రసాయనాలను నిల్వ చేశారు హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని... క్లూస్ టీమ్స్ కొన్ని ఆధారాలు సేకరించారని చెప్పారు. భవనానికి ఫైర్ సేఫ్టీ కూడా లేదని అధికారులు గుర్తించారు. దీంతో భవన యజమాని రమేష్ జైస్వాల్‌పై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం.. ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండంతో.. డిశ్చార్జ్ అయిన తర్వాత అదుపులోకి తీసుకుంటామని చెప్పారు పోలీసులు.