Shiva Balakrishna Bail Petition: హైదరాబాద్: హెచ్ఎండీఏ (HMDA) మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన శివబాలకృష్ణ (Shiva Balakrishna) బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి ఏసీబి కోర్టు కొట్టివేసింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆయనపై అభియోగాలు ఉన్నాయి. ఏసీబీ దర్యాప్తులో శివబాలకృష్ణకు సంబంధించి ఇప్పటివరకు రూ.250 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. శివబాలకృష్ణ అవినీతి కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ ను విచారించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు విచారణకు సంబంధించి ఐఏఎస్‌కు నోటీసులు పంపినట్లు సమాచారం.


తెలంగాణతో పాటు ఏపీలోనూ భారీగా ఆస్తులు 
శివబాలకృష్ణకు బెయిల్ మంజూరు చేయవద్దని ఏసీబీ అధికారులు కౌంటర్ పిటిషన్ వేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న నాంపల్లి ఏసీబీ కోర్టు హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. ఏసీబీ విచారణలో శివబాలకృష్ణ అక్రమాస్తులు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఆయనకు తెలంగాణతో పాటు ఏపీలోనూ భారీగా ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. దొరికిన డాక్యుమెంట్స్ ఆధారంగా శివబాలకృష్ణ అక్రమాస్తుల లెక్కలు చూసి అధికారులు షాక్ అవుతున్నారు. 


రూ.250 కోట్ల ఆస్తులు.. విలువ పెరిగే ఛాన్స్ 
శివబాలకృష్ణకు 214 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. దాంతోపాటు 29 ప్లాట్స్‌‌, విలాసవంతమైన విల్లాలు, బంగారం, ఖరీదైన వాచ్‌లు, ఖరీదైన మొబైల్స్ శివబాలకృష్ణ వద్ద ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రస్తుత మార్కెట్ ప్రకారం చూస్తే.. ఈ అవినీతి అధికారి ఆర్జించింది రూ.250 కోట్లు ఉంటుందని ఏసీబీ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. మొత్తం లెక్కలు తేలితే వీటి విలువ రూ.500 కోట్లు దాటవచ్చునని భావిస్తున్నారు. జనవరి 24న ఏసీబీ అధికారులు శివబాలకృష్ణను అరెస్ట్ చేశారు. ఏసీబీ కోర్టు అనుమతితో అధికారులు 8 రోజులపాటు కస్టడీకి తీసుకుని హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ ను విచారించగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈయన వెనుక ఎవరున్నారు, ఎవరి అండతో ఈ స్థాయిలో ఆదాయాన్ని కూడకట్టారని, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.