Akbaruddin Owaisi: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin Owaisi) విద్వేషపూరిత వ్యాఖ్యల కేసును నాంపల్లి కోర్టు (Nampalli Court) కొట్టివేసింది. ఆయనపై ఉన్న పదేళ్ల నాటి రెండు కేసులను స్పెషల్ సెషన్స్ జడ్జి కొట్టివేశారు. దాదాపు పదేళ్ల తర్వాత కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. కేసు కొట్టేసినంత మాత్రాన సంబరాలు చేసుకోవద్దని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఇలాంటి రెచ్చగొట్టేలాంటి వ్యాఖ్యలు ఇంకోసారి మాట్లాడవద్దని కోర్టు అక్బరుద్దీన్‌ను ఆదేశించింది. అవి దేశ సమగ్రతకు మంచిది కాదని, ఇదేదో విజయంలాగా భావించొద్దని కోర్టు పేర్కొంది. దీంతో అక్బరుద్దీన్‌కు భారీ ఊరట కలిగినట్లయింది. 


అసలేం జరిగిందంటే..


నిర్మల్‌లోని నిర్మల్ మున్సిపల్ గ్రౌండ్స్ లో పదేళ్ల క్రితం అంటే 2012 డిసెంబరులో మజ్లిస్ పార్టీ (AIMIM) ఓ బహిరంగ సమావేశాన్ని నిర్వహించింది. ఆ సభలో ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ విద్వేషపూరితంగా (Akbaruddin Owaisi Hate Speech) మాట్లాడారు. ఆ ఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం రేపాయి.


ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే... ‘‘మీరు 100 కోట్ల మంది.. మేం కేవలం 25 కోట్ల జనాభా మాత్రమే  మాత్రమే.. ఓ 15 నిమిషాలు మాకు అప్పగించండి. ఎవరు ఎక్కువో.. ఎవరు తక్కువో చూపిస్తాం..’’ అంటూ అక్బరుద్దీన్ (Akbaruddin Owaisi Hate Speech) ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంపై ఐపీసీ 120- బీ (నేరపూరిత కుట్ర), 153 ఏ (రెండు గ్రూపుల మధ్య మతం పేరుతో విద్వేషం రెచ్చగొట్టేలా మాట్లాడడం), 295 ఏ (ఉద్దేశపూర్వక, హానికరమైన చర్యలు, ఏ వర్గం వారి మతాన్ని లేదా మత విశ్వాసాలను అవమానించడం ద్వారా వారి మతపరమైన భావాలను ఆగ్రహానికి గురిచేయడం), 298 (ఏదైనా వ్యక్తి యొక్క మతపరమైన భావాలను భంగం కలిగేలా ఉద్దేశపూర్వక ప్రసంగం), 188 సెక్షన్ల కింద పోలీసులు కేసులు పెట్టారు. 







ఆ సమయంలో అక్బరుద్దీన్ లండన్ వెళ్లిపోయారు. ఆయన తిరిగి వచ్చాక పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో అరెస్టయిన అక్బరుద్దీన్ అప్పట్లో 40 రోజుల పాటు జైల్లో కూడా ఉన్నారు. ఆ తర్వాత బెయిల్‌పై బయటికి వచ్చారు. ఇదే కాకుండా నిజామాబాద్ లోనూ అక్బరుద్దీన్ హిందూ దేవతల పైన అనకూడని వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు కేసులను విచారణ జరిపిన కోర్టు పదేళ్ల తర్వాత ఆయనపై నమోదైన కేసులను కొట్టివేసింది.