Revanth Reddy Comments: బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదని... బ్రిటీష్ జనతా పార్టీ అని టీసీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే డబుల్ ఇంజిన్ అంటే ఒకటి ప్రధాని మోదీ అని మరొక ఇంజిన్ అదానీ అని ఎద్దేవా చేశారు. అదానీ ఇంజిన్ కు రిపేర్ వచ్చిందని.. అందుకే ప్రధాని మోదీకి భయం పట్టుకుందని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ విభజించు-పాలించు అనే విధానాన్ని అవలంభిస్తోందని అన్నారు. ఆర్ఎస్ఎస్ ను వల్లభ భాయ్ పటేల్ నిషేధించారని గుర్తుచేశారు. దేశ సంపదను అదానీ సంస్థ కొల్లగొడుతోందని విమర్శించారు. అదానీ పోర్టు నుంచి మాదక ద్రవ్యాలు సరఫరా అవుతున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో నిర్వహించిన సంకల్స సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీపై మండిపడ్డారు. అదానీపై మాట్లాడినందుకే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాహుల్ గాంధీని చూసి ప్రధాని నరేంద్ర మోదీ భయపడుతున్నారని అన్నారు. డొల్ల కంపెనీల్లో అదానీ పెట్టుబడులు పెట్టారని తెలిపారు. పెట్టుబడులపై ఈడీ విచారణ కోరినందుకే రాహుల్ ను అడ్డుకున్నారని అన్నారు. బీజేపీ నేతలు చాలా మందిపై తీవ్రమైన నేర ఆరోపణలు ఉన్నాయన్నారు.
"దోపిడీ మీద భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉంటుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ అని. డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క అర్థం ఈడున్న మిత్రులకు తెల్సో తెల్వదో నాకు తెల్వదు గానీ నేను చెప్పదల్చుకున్న. డబుల్ ఇంజిన్ కా మత్లబ్.. అదానీ, ప్రధాని. ఏక్ ఇంజిన్ అదానీ, దూస్రే ఇంజిన్ ప్రధాని." - రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్, ఎంపీ
రాహుల్ గాంధీకి పైకోర్టులో అప్పీల్ కు వెళ్లేందుకు 30 రోజుల గడువు ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. కోర్టు గడువు లేకపోతే రాహుల్ గాంధీని ఎప్పుడో అరెస్ట్ చేసేవారని అన్నారు. ఇప్పటికీ గాంధీ కుటుంబానికి సొంత ఇల్లు లేదని వివరించారు. దేశం తిరిగి బానిసత్వం వైపు వెళ్తుందని అన్నారు. బానిసత్వం వైపు వెళ్లకుండా దేశాన్ని యువతు కాపాడాలని రేవంత్ రెడ్డి వెల్లడించారు. అలాగే రాహుల్ గాంధీపై బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ పోరాటం ఆగదని రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ సంకల్ప్ సత్యాగ్రహ పేరుతో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తుంది. రాహుల్ గాంధీ గొంతును అణచివేసి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని బీజేపీ, మోదీ చూస్తున్నారని ఆరోపించారు. అలాంటి కుట్రలను తిప్పి కొడతామన్నారు.