Kishan Reddy On Papers Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఆందోళనలో అరెస్ట్ అయిన బీజేపీ యువమోర్చా నేతలను చంచల్ గూడ జైలులో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. అనంతరం జైలు వద్ద మీడియాతో మాట్లాడారు. ఇవాళ తెలంగాణలో విద్యార్థులు, నిరుద్యోగ యువకులు తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నారన్నారు. ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురై ఎంతో కష్టపడి పరీక్షలురాస్తే దాని ఫలితాలను పొందే సమయంలో ఈ రకంగా ప్రశ్నాపత్రాల లీక్ కావడంతో తీవ్రమైనటువంటి ఆవేదన చెందుతున్నారన్నారు. పేపర్స్ లీక్ అవడం చాలా దుర్మార్గమన్నారు. దీంట్లో పెద్దల హస్తముందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి అన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రశ్నాపత్రాలు లీక్ తమ పొరపాటు, చేతగానితనం, తమ అసమర్ధత అని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదన్నారు.
పెద్దల హస్తం
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వెనక పెద్దల హస్తం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ లీకేజీని న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీపై ఆందోళనలో అరెస్టైన బీజేవైఎం నేతలను కిషన్ రెడ్డి చంచల్ గూడా జైలులో ఆదివారం పరామర్శించారు. పేపర్ లీకేజీతో నిరుద్యోగ యువత అంతా ఆగ్రహంతో ఉన్నారన్నారు. పేపర్ లీకేజీ ప్రభుత్వ చేతగాని తనమని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిని, అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి వితండవాదం చేస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాలలో వైఫల్యం చెందిందన్నారు. రాష్ట్రంలో మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. తెలంగాణలో కుటుంబ, అవినీతి, అక్రమ, మాఫియా పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీ కార్యకర్తలు జైళ్లు కొత్త కాదన్నారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ అసమర్థత
"తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఎక్కడ చూసిన అవినీతి తాండవంచేస్తుంది. యువత ఈ రాష్ట్రంలో మార్పురావాలని కోరుకుంటున్నారు. తప్పకుండా తెలంగాణలో మార్పువస్తుంది. కుటుంబ పాలన పోతుంది. ఎంతో కష్టపడి, అప్పులు చేసి చదువుకుంటే... చివరకు ఉద్యోగాలు వచ్చే సమయానికి పేపర్ల లీకేజీ జరిగింది. దీనిపై యువత ఆగ్రహంతో ఉన్నారు. దీంతో పెద్దల హస్తం ఉందని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రశ్నాపత్రాలు లీక్ అవ్వడంతో యువత ఆవేదన చెందతున్నారు. అన్ని అక్రమాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదు. పేపర్ల లీకేజీని న్యాయమూర్తితో విచారించాలి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉంది. పేపర్ల లీకేజీ తన పొరపాటు అని ఒప్పుకోడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇతర రాష్ట్రాల్లో జరగడంలేదా అని ఎదురుప్రశ్నిస్తున్నారు. తమ తప్పును ఒప్పుకోవడంలేదు. అందుకే తెలంగాణలో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా యువత దీనిపై చర్చించుకుంటున్నారు. తెలంగాణలో మాఫియా పాలన పోవాలని కోరుకుంటున్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ మార్పు తీసుకువస్తుంది. " - కిషన్ రెడ్డి