శాకాహారులు, మాంసాహారులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తినే ఆహారం పప్పు. కందిపప్పు, పెసరపప్పు సెనగపప్పు ఇలా అన్ని రకాల పప్పులతో రకరకాల ఆహార పదార్థాలు, కూరలు వండుకునే వాళ్ళు ఎంతోమంది. పప్పును ఉడకబెట్టి, పోపు వేసి చేసే వంటకం ప్రతి ఇంట్లో సాధారణంగా కనిపిస్తూనే ఉంటుంది. ప్రోటీన్ కోసం ఇలా పప్పును తినేవాళ్లు ఎంతోమంది. మాంసాహారులకు చికెన్ నుంచి ప్రోటీన్ అధికంగా అందుతుంది. శాకాహారులకు మాత్రం పప్పే ప్రధాన ఆధారం. అయితే ఇప్పుడు పప్పును కుక్కర్లో పెట్టి ఉడికించి వెంటనే వండేస్తున్నారు. కానీ ప్రాచీన కాలంలో కుక్కర్లు లాంటివి ఉండేవి కాదు. అప్పుడు గంటల తరబడి పప్పును నీళ్లలో నానబెట్టి, ఆ తర్వాత ఉడికించి ఉండేవాళ్ళు. అయితే అప్పటి సాంప్రదాయ వంట ఉత్తమమైనది. పోషకాహార నిపుణులు కుక్కర్లో ఉడకబెట్టడానికి ముందు పప్పును కనీసం రెండు నుంచి మూడు గంటలు నీళ్లలో నానబెట్టడం మంచిదని సూచిస్తున్నారు.
ఎందుకు నానబెట్టాలి?
కుక్కర్లో ఉడికిస్తే సరిపోతుంది కదా పప్పును ఎందుకు ముందుగా నీళ్లలో నానబెట్టాలి? అనే సందేహం మీకు వచ్చే ఉంటుంది. పప్పును ముందుగా నానబెట్టడం వల్ల వండిన తర్వాత ఆ వంటకానికి మృదుత్వం, అధిక రుచి వస్తుంది. అంతేకాదు వంట సమయం కూడా తగ్గుతుంది. ఆయుర్వేదం ప్రకారం పప్పును ముందుగా నీళ్లలో నానబెట్టడం వల్ల అందులో ఉండే ఫైటిక్ ఆసిడ్లు, టానిన్ల శాతం తగ్గుతుంది. ఈ ఫైటిక్ ఆసిడ్లు, టానిన్లు ఉంటే పప్పు తిన్నాక మన శరీరం పోషకాలను గ్రహించడాన్ని అడ్డుకుంటాయి. అలాగే కడుపు ఉబ్బరాన్ని కలిగిస్తాయి. కాబట్టి నీళ్లలో నానబెట్టి పప్పు వండడం వల్ల అలాంటి సమస్యలు రావు. ముఖ్యంగా నీళ్లలో నానబెట్టని పప్పును తినే వారిలో చాలామందికి పొట్ట అసౌకర్యంగా ఉండడం లేదా బరువు పెరగడం వంటివి జరుగుతాయి. కాబట్టి నీళ్లలో నానబెట్టి పప్పును వండితే ఇలాంటి సమస్యలు రావు.
అంతేకాదు పప్పులు ముందుగా నీళ్లలో నానబెట్టడం వల్ల వాటిలోని ఆమ్ల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. ఆయుర్వేదం ప్రకారం పప్పు... నీళ్లలో నానితే వాటికి జీవం వస్తుందని అంటారు. శరీరానికి పప్పు అందించే ఆరోగ్య గుణాలు పెరుగుతాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా ఈ నానబెట్టిన పప్పులు ఎంతో సహాయపడతాయి. నీళ్లలో పప్పును నానబెట్టడం వల్ల అమైలేస్ ప్రేరేపించడంలో సహాయపడుతుంది. వీటిలో ఉండే సంక్లిష్ట పిండిని పదార్థాలను విచ్ఛిన్నం అయ్యేలా చేస్తాయి. దీనివల్ల శరీరం ఆ పప్పును సులభంగా జీర్ణం చేసుకుంటుంది. పోషకాలను శరీరం గ్రహించేలా చేయడానికి, జీర్ణక్రియ మృదువుగా జరిగేలా చూసుకోవడానికి పప్పులను నీళ్లలో నానబెట్టి ఆ తర్వాతే ఉడకబెట్టడం మంచిది.
Also read: గర్భిణులు జాగ్రత్త, దంత సమస్యలు ఉంటే ముందస్తు ప్రసవం అయ్యే అవకాశం - చెబుతున్న కొత్త అధ్యయనం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.