పెళ్లయిన ప్రతి స్త్రీ తల్లి కావాలని కోరుకుంటుంది. అందుకోసం ఎన్నో పూజలు, వ్రతాలు చేసేవారు కూడా ఉన్నారు. అయితే గర్భం ధరించాక జాగ్రత్తలు పాటించే వారి సంఖ్య మాత్రం తక్కువే. గర్భధారణ సమయంలో చిన్న చిన్న అంశాలు కూడా ఒక్కోసారి ప్రమాద కారకాలుగా మారుతాయి. అలాంటిదే చిగుళ్ల వాపు. దీన్ని జింజివైటిస్ అంటారు. ఎవరికైతే గర్భధారణ సమయంలో ఈ చిగుళ్ల వాపు సమస్య ఉంటుందో వారికి ముందస్తుగా ప్రసవం అయ్యే అవకాశం ఉందని ఒక అధ్యయనం చెబుతుంది. అందుకే గర్భం ధరించాక నోటి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టమని సూచిస్తుంది ఈ అధ్యయనం.
యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ కి చెందిన శాస్త్రవేత్తలు నోటి ఆరోగ్యానికి, గర్భధారణకు మధ్య ఉన్న సంబంధాన్ని కనిపెట్టేందుకు అధ్యయనం నిర్వహించారు. సాధారణంగా గర్భం ధరించినప్పుడు అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటి వాటిల్లో చిగుళ్ళు దంతాల సమస్యలు కూడా రావచ్చు. కానీ వాటిని చాలామంది పట్టించుకోరు. కారణం వాటికి, ప్రసవానికి ఎలాంటి సంబంధం లేదని అనుకుంటారు. చిగుళ్ల వాపు, దంతాలపై గార పేరుకొని ఉండడం వంటివి శరీరంలో ఇన్ఫ్లమేషన్ కు సూచికలు. దంతాలపై ఉన్న బ్యాక్టీరియా లేదా చిగుళ్లపై ఉన్న బ్యాక్టీరియా నోటిద్వారా పొట్టలోకి.... పొట్ట నుంచి మాయ ద్వారా బిడ్డకు చేరడానికి ఎక్కువ కాలం పట్టదు. దీనివల్ల బిడ్డకు కూడా అనేక సమస్యలు రావచ్చు. ముఖ్యంగా నెలలు నిండకుండానే ప్రసవం అయ్యే ప్రమాదము ఉంది. అందుకే గర్భం ధరించాక ఆహారం, మందుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తారో నోరు శుభ్రంగా ఉంచుకునే విషయంలో కూడా అంతే జాగ్రత్తలు పాటించాలి.
ఒక సర్వే ప్రకారం మన దేశంలో గర్భం ధరించిన వారిలో 70 శాతం మంది చిగుళ్ల సమస్యలతో బాధపడుతుంటారని అంచనా. ఇలా చిగుళ్ల సమస్యల బారిన పడిన వారిలో మధుమేహం, గుండె, కిడ్నీ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి చిగుళ్ల వాపు లేదా ఇతర దంత సమస్యలు కనిపిస్తే వాటిని తేలిగ్గా తీసుకోకుండా వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం. రోజులో రెండు సార్లు బ్రష్ చేసుకోవాలి. దీని వల్ల తిన్న తరువాత ఆహార అవశేషాలు నోటిలో మిగిలిపోయి, అవి బ్యాక్టిరియాకు ఆవాసమవుతున్నాయి. నోటిలో పుట్టిన బ్యాక్టిరియాలో పొట్టలోకి చేరి ఇబ్బందులకు కారణం అవుతుంది.
Also read: ఎరుపు రంగు ఫుడ్ కలర్ వాడుతున్నారా? అది దేనితో తయారు చేస్తారో తెలిస్తే షాక్ అవుతారు
Also read: ఈ అరటిపండు తింటే మధ్యాహ్నం మీల్స్ తిన్నట్టే, ఒక్క పండుకే పొట్ట నిండిపోతుంది
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.