Nehru Zoo Park Cheetah : కరోనా తర్వాత గుండెపోటు సమస్యలు తీవ్రమయ్యాయని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు పెరిగాయి. అయితే తాజాగా గుండెపోటుతో ఓ చిరుత పులి మరణించింది. హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్‌లో ఆదివారం చిరుత పులి గుండెపోటుతో మృతి చెందింది. ఈ చిరుత వయసు 13 ఏళ్లు. నెహ్రూ జూలో ఉన్న ఏకైక చిరుత ఇదే కావడం గమనార్హం. దీని పేరు అబ్దుల్లా. ఈ చిరుత నెహ్రూ జూపార్క్‌కి 2011లో సౌదీ దేశం నుంచి వచ్చింది. 2011లో సౌదీ రాజు హైదరాబాద్‌ పర్యటనకు వచ్చినప్పుడు నెహ్రూ జూ పార్క్‌ను సందర్శించారు. ఆ సందర్భంగా జూ పార్క్‌కు ఓ జంట చిరుతలను బహుమతిగా ఇస్తామని సౌదీ రాజు హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు అబ్దుల్లా, హీబా అనే పేరు గల చిరుతలను నెహ్రూ జూ పార్క్ కు బహుమతిగా అందించారు. ఇన్నాళ్లు సందర్శకులను ఆకట్టుకున్న చిరుత గుండె పోటుతో మరణించడంతో జూ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో నెహ్రూ జూలాజికల్ పార్క్ లో చిరుతలే లేకుండా పోయాయి. భారత్ లో 70 ఏళ్ల క్రితమే చిరుత పులులు అంతరించిపోయాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నమీబియా నుంచి 8 చిరుతలను మన దేశానికి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ చిరుతలు మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ లో ఉన్నాయి.  


"నెహ్రూ జూపార్క్ లో ఒక్కటే చిరుత ఉంది.  అది ఈ నెల 24న గుండెపోటుతో చనిపోయింది. అనంతరం పోస్టుమార్టమ్ చేయగా కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోయిందని వైద్యులు తెలిపారు.2011లో సౌదీ ప్రిన్స్ ఇక్కడ వచ్చినప్పుడు జూ పార్క్ చూసి రెండు చిరుతలను ఇస్తామని హామీ ఇచ్చారు. గిఫ్ట్ గా అబ్దుల్లా, హీబా అనే జంట చిరుతలను ఇచ్చారు. నాలుగేళ్ల క్రితం హీబా పక్షవాతంతో చనిపియింది. అబ్దుల్లా వయసు 13 సంవత్సరాలు. అయితే చిరుత సాధారణ లైఫ్ స్పాన్ 15 ఏళ్లు. ఈ చిరుత ఓల్డ్ అయింది. అది కూడా దీని మరణానికి కారణం. చిరుత కార్డియాక్ అరెస్ట్ కు చాలా కారణాలు ఉంటాయి. అన్ని వివరాలు సేకరించి ల్యాబ్ కు పంపించాం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గతంలో ఒక చిరుత పక్షవాతం వచ్చి చనిపోయింది." - జూ డాక్టర్ హకీమ్