Revanth Reddy : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా గాంధీ భవన్ లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సంకల్ప్ సత్యాగ్రహ పేరుతో దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నయా నియంతగా మారి ప్రజాస్వామ్య వ్యవస్థకు తూట్లు పొడుతున్నారని విమర్శించారు. తన మిత్రుల కోసం ప్రధాని మోదీ దేశాన్ని కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఫిబ్రవరి 7న అదానీ కుంభకోణంపై లోక్ సభలో ప్రశ్నించారని దీంతో ప్రధాని ఉక్కిరి బిక్కిరై సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. బీజేపీ డబుల్ ఇంజన్ అనే అదానీ-ప్రధాని ఎద్దేవా చేశారు.  నేరుగా రాహుల్ గాంధీని ఎదుర్కొనే ధైర్యం లేకే కుట్రపూరితంగా ఆయనపై అనర్హత వేటు వేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజల పక్షాన నిలబడన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. బీజేపీ ప్రభుత్వం హడావుడిగా రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  


ఏఐసీసీ ఆదేశిస్తే రాజీనామాలు 


రాహుల్‌ గాంధీపై బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ పోరాటం ఆగదని రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్‌ గాంధీపై అనర్హత వేటును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ సంకల్ప్‌ సత్యాగ్రహ పేరుతో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తుంది.  రాహుల్‌ గాంధీ గొంతును అణచివేసి కాంగ్రెస్‌ పార్టీని భూస్థాపితం చేయాలని బీజేపీ, మోదీ చూస్తున్నారని ఆరోపించారు. అలాంటి కుట్రలను తిప్పి కొడతామన్నారు. రాహుల్‌గాంధీని ఎదుర్కొనే ధైర్యం లేక కుట్రపూరితంగా వేటు వేశారని రేవంత్‌ ఆరోపించారు. దేశ స్వాతంత్ర్యం కోసం రాహుల్‌ గాంధీ తాత నెహ్రూ జైలుకు వెళ్లారని గుర్తుచేశారు. రాహుల్‌ గాంధీపై అనర్హత వేటును నిరసిస్తూ చేపట్టాల్సిన ఆందోళనపై త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. కాంగ్రెస్‌ ఎంపీలు రాజీనామా చేయాలనే అంశంపై కూడా చర్చ జరుగుతోందన్నారు. ఈ విషయంలో ఏఐసీసీ నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని తెలిపారు. అధిష్ఠానం ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తామన్నారు. 


అదానీ వ్యవహరాన్ని డైవర్ట్ చేసేందుకే - ఎంపీ కోమటిరెడ్డి


రాహుల్ గాంధీ అనర్హత అప్రజాస్వామికం అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ చర్యలను నిరసిస్తూ... గాంధీ భవన్ లో చేపట్టిన సంకల్ప్ సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం అని ప్రకటించారు. అదానీ విషయాన్ని డైవర్ట్ చేసేందుకే రాహుల్ పై అనర్హత వేటు వేశారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. అవసరం అయితే ఎంపీలంతా మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని కోమటిరెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ అనర్హత వేటు పడిన పరిస్థితి కంటతడి పెట్టేలా ఉందని వివరించారు. ప్రధాన మంత్రి అయ్యే అవకాశం వచ్చినా రాహుల్ గాంధీ వదులుకున్నారని గుర్తు చేశారు. అదానీ గురించి రాహుల్ ఎప్పుడు మాట్లాడారో అప్పటి నుంచి కుట్ర చేశారని తెలిపారు. ఆగమేఘాల మీద పరువు నష్టం కేసులో శిక్ష పడేలా చేశారన్నారు. అయితే ఇందిరా గాంధీపై వేటు వేస్తే ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుందని ఎంపీ కోమటి రెడ్డి అన్నారు