LVM3 Rocket Launch: ఎల్‌వీఎం౩-ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఏపీ సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో బృందానికి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. భారత అంతరిక్ష చరిత్రలో ఈరోజు ఓ ముఖ్యమైన మైలురాయిగా ఎప్పటికీ గుర్తుండిపోతుందని ట్వీట్ చేశారు. కాగా వాణిజ్య ప్రయోగాల్లో ఇస్రో మరోసారి సత్తా చాటింది. LVM3-M3 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. మొత్తం 36 ఉపగ్రహాల్లో 16 ఇప్పటికే వాటి వాటి కక్ష్యల్లో కుదురుకున్నాయి. మిగతా 20 ఉపగ్రహాలు రాకెట్ నుంచి విడిపోయి భూమిపై ఉన్న ఎర్త్ స్టేషన్లకు సిగ్నల్స్ పంపిస్తాయని తెలిపారు అధికారులు. విజిబిల్ ఏరియాలో ఆ శాటిలైట్స్ సెపరేషన్ జరగదని చెప్పారు. రాకెట్ ప్రయోగం విజయవంతమైందని, శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్.
ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ రెండు దశల్లో 72 ఉపగ్రహాలను ప్రయోగించడానికి వన్ వెబ్ తో గతంలో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా మొదటి 36 ఉపగ్రహాలను 2022 అక్టోబరు 23న ఇస్రో విజయవంతంగా కక్ష్యల్లో ప్రవేశ పెట్టింది. ఈసారి మరో 36 ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. ఈ ఒప్పందం పూర్తి స్థాయిలో విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆనందం నెలకొంది. దేశీయ అవసరాలే కాకుండా ఇస్రో.. వాణిజ్య ప్రయోగాల్లో కూడా తనకు సాటిలేదని నిరూపించుకుంది. LVM3 -M3 రాకెట్ ప్రయోగానికి శనివారం ఉదయం 8.30 గంటలకు కౌంట్ డౌన్ మొదలైంది. నిరంతరాయంగా 24.30 గంటల కౌంట్ డౌన్ అనంతరం ఈరోజు ఉదయం 9 గంటలకు రాకెట్ నిప్పులు చెరుగుతూ నింగికెగిరింది. శ్రీహరికోటలోని షార్ రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగం జరిగింది.
ఈ ప్రయోగం ద్వారా యూకేకి చెందిన నెట్ వర్క్ యాక్సెస్ అసోసియేట్ లిమిటెడ్ కంపెనీ, ఇండియాకు చెందిన భారతీ ఎంటర్ ప్రైజెస్ సంయుక్తంగా వన్‌వెబ్ ఇండియా–2 పేరుతో ఉపగ్రహాలను నింగిలోకి పంపించాయి. 5,805 కిలోల బరువు కలిగిన 36 సమాచార ఉపగ్రహాలను భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులోని లోయర్ ఎర్త్ ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టారు. ఉదయం 9 గంటలకు మొదలైన ప్రయోగం 19.7 నిమిషాల్లోనే పూర్తయింది.
మూడు దశల్లో ప్రయోగం..
LVM3 -M3 రాకెట్ పొడవు 43.5 మీటర్లు, వెడల్పు 4.4 మీటర్లు, బరువు 643 టన్నులు. మొదటి దశలో 200 టన్నుల బరువు గల ఘన ఇంధన ఎస్-200 స్ట్రాఫాన్ బూస్టర్లను ఈ రాకెట్ కలిగి ఉంటుంది. రెండో దశను ఎల్-110 కోర్ గా పిలుస్తారు. ఈ దశలో 110 టన్నుల ద్రవ ఇంధనం ఉంటుంది. మూడో దశలో సీ-25 అతిశీతల క్రయోజనిక్ ఇంధనం 25 టన్నుల బరువు కలిగి ఉంటుంది. ఘన, క్రయో ఇంధనాన్ని ముందుగానే నింపుతారు. ద్రవ ఇంధనాన్ని కౌంట్ డౌన్ జరిగే సమయంలో నింపారు.