మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి హత్య కేసులో నేడు (ఏప్రిల్ 17) మధ్యాహ్నం 3 గంటలకు సీబీఐ విచారణకు హాజరు కావాల్సి ఉన్న వేళ ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ పిటిషన్‌లో కీలక వివరాలు పేర్కొన్నారు. తనకు సంబంధం లేని కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. కోర్టుపై తమకు నమ్మకం ఉందని, న్యాయం గెలుస్తుందని తాము నమ్ముతున్నట్లు చెప్పారు. 


సీఆర్పీసీ 160 కింద నోటీసులు ఇచ్చారని, తన స్టేట్ మెంట్ రికార్డు చేశారని అన్నారు. వివేకానంద రెడ్డి కూతురు సునీత స్థానిక ఎమ్మెల్సీ ద్వారా చంద్రబాబు, సీబీఐ ఆఫీసర్ కుమ్మక్కు అయ్యారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అప్రూవర్ గా మారిన దస్తగిరి వాంగ్మూలంతో తనను ఈ కేసులో కుట్ర పన్ని ఇరికిస్తున్నారని వివరించారు. దస్తగిరిని ఢిల్లీకి పిలిచి చాలా రోజుల పాటు సీబీఐ తన దగ్గర ఉంచుకుందని, అక్కడే అతడిని అప్రూవర్‌గా మార్చారని వివరించారు. ఈ కేసులో తనపై ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. దస్తగిరి స్టేట్మెంట్ ఒక్కటే ప్రామాణికంగా సీబీఐ తీసుకుందని అన్నారు.


గూగుల్ టేకౌట్ ఆధారంగానే తనను నిందితుడిగా చేర్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఒక వ్యక్తి ఎక్కడున్నాడో గూగుల్ టేకవుట్ అనేది చెప్పలేదని అన్నారు. హత్య జరిగిన ఈ నాలుగేళ్ల నుంచి తనను చాలా సార్లు టార్గెట్ చేశారని, ఇప్పుడు నిందితుడిగా చేర్చి అరెస్టు చేసే యోచనలో సీబీఐ ఉందని వివరించారు. అందుకే ఒకవేళ సీబీఐ అరెస్టు చేసినా బెయిల్ పై విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఎంపీ అవినాష్ రెడ్డి పిటిషన్‌లో కోరారు.


లైంగిక సంబధాల వల్లే


వివేకానంద రెడ్డికి మహిళలతో సంబంధాలు ఉన్నాయని, అవే ఆయన హత్యకు దారితీశాయని పిటిషన్ లో వివరించారు. ఏ-2గా ఉన్న సునీల్ యాదవ్‌ తల్లితో పాటు ఉమాశంకర్‌ రెడ్డి భార్యతో వివేకాకు సంబంధం ఉందని పిటిషన్‌లో ఆరోపించారు. మరోవైపు నిందితులతో వివేకానంద రెడ్డి వజ్రాల వ్యాపారం కూడా చేశారని పేర్కొన్నారు. వివేకా తన రెండో భార్యతో ఆర్థిక వ్యవహారాలన్నీ తనతో పంచుకోవడంతో సునీత కక్షగట్టారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ అంశాలను పరిగనలోకి తీసుకుని తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని విఙ్ఞప్తి చేశారు.


బెయిల్ పిటిషన్ విచారణ తర్వాతే సీబీఐ విచారణకు వెళ్తా - అవినాష్ రెడ్డి


ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటిషన్‌పై హైకోర్టు నిర్ణయం తర్వాత సీబీఐ విచారణకు హాజరు అవుతానని మీడియాతో మాట్లాడుతూ ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. అప్పటివరకు సీబీఐ విచారణకు హాజరు కాలేనని అన్నారు. కోర్టుపై తమకు నమ్మకం ఉందని, సంబంధం లేని కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. న్యాయం గెలుస్తుందని తాము నమ్ముతున్నట్లు చెప్పారు. 


తెల్లవారుజామునే పులివెందుల నుంచి హైదరాబాద్‌కు


సీబీఐ అధికారుల ఎదుట హాజరు కావడం కోసం పులివెందులలోని తన నివాసం నుంచి నేడు తెల్లవారుజామునే అవినాష్ రెడ్డి హైదరాబాద్‌కు బయలు దేరారు. ఉదయం 5.30 గంటలకు అవినాష్ రెడ్డి పులివెందులలోని తన ఇంటి నుంచి బయలుదేరారు. ఏకంగా 10 వాహనాల్లో తన అనుచరులతో కలిసి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హైదరాబాద్ కు ప్రయాణం అయ్యారు. వీరిలో వైఎస్ఆర్ సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఉన్నారు.