Hyderabad News: నిన్న (ఏప్రిల్ 16) కిడ్నాప్ కు గురైన మాజీ విలేకరి కరుణాకర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్ శివారు కొత్తూరు పరిధిలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మల్లాపూర్ గ్రామానికి చెందిన 29 ఏళ్ల మామిడి కరుణాకర్ ఓ పత్రికలో విలేకరిగా పని చేసేవాడు. అయితే కొద్ది నెలల క్రితమే ఆ ఉద్యోగం మానేశాడు. ప్రస్తుతం కొత్తూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్ గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం రోజు రాత్రి తన ఇంటి పక్కన ఉండే శ్రీధర్ రెడ్డితో కలిసి కారులో చేగూరు నుంచి తిమ్మాపూర్ వైపు వెళ్తుండగా.. మార్గ మధ్యలో తీగాపూర్ వద్ద కాపు కాసిన దుండగులు వారిని అడ్డగించారు. కారు అద్దాలు మొత్తం పగుల గొట్టి శ్రీధర్ రెడ్డిపై దాడి చేశారు. అనంతరం కరుణాకర్ రెడ్డిని మరో కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సోమవారం తెల్లవారు జామున రెండు గంటల సమయంలో గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ మృతదేహాన్ని వదిలేసి వెళ్లినట్లు పోలీసులకు సమాచారం అందింది. 


హత్య చేసింది వాళ్లేనా, ఫోన్ స్విచ్ఛాఫ్ ఎందుకొస్తోంది?


హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు . మృతదేహాన్ని పరిశీలించగా... అది కిడ్నాప్ కు గురైన కరుణాకర్ రెడ్డి మృతదేహంగా గుర్తించారు. వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే కరుణాకర్ రెడ్డి హత్యకు కొత్తూరు మండల స్థాయి ప్రజా ప్రతినిధియే కారణం అని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ప్రజా ప్రతినిధిది, కరుణాకర్ రెడ్డిది ఒకే ఊరని.. ప్రజా ప్రతినిధి వద్ద ప్రధాన అనుచరుడిగా పని చేసిన కరుణాకర్ రెడ్డి కొంత కాలంగా ఆయనకు దూరంగా ఉంటున్నట్లు చెప్పారు. విబేధాలు రావడంతోనే వారి మధ్య గొడవలు జరిగాయని.. కేసులు కూడా నమోదయ్యాయని అన్నారు. ఈ క్రమంలోనే సదరు ప్రజా ప్రతినిధి అనుచరులు, తమ్ముళ్లే కరుణాకర్ రెడ్డిని అపహరించి, దారుణంగా త్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కరుణాకర్ రెడ్డి హత్య జరిగినప్పటి నుంచి ప్రజా ప్రతినిధి, ఆయన అనుచరుల ఫోన్లు స్విచ్ఛాఫర్ లో ఉన్నాయని.. వారు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. 


"శ్రీధర్ రెడ్డొళ్ల మామను దింపి రావడానికి పోయిర్రు. తిరిగి వస్తుంటే.. విష్ణు వర్ధన్, విక్రమ్, విక్రమ్ బామ్మర్ది. ఇంకో ముస్లిం అబ్బాయి వీరంతా కలిసి మా తమ్ముడు కరుణాకర్ రెడ్డిని తీసుకపోయారు. వివాదాలు ఏం లేవు. వాళ్ల దగ్గర మా తమ్ముడు పని చేసినంత కాలం బాగానే ఉంది. కానీ మానేసి వేరే దగ్గరకు వెళ్లి పని చేసుకుంటుంటే ఓర్వలేక ఇలా చేశారు. ఆయన వీక్ నెస్ లు ఏమన్నా బయట చెప్తడమే కోపంతో కూడా ఇట్ల చేసిండొచ్చు. కానీ గొడవలు లాంటివి మాత్రం ఏంలేవు". - కరుణాకర్ రెడ్డి సోదరుడు