హైదరాబాద్: కేసీఆర్, కేటీఆర్ మీద ఏమైనా ఫ్రస్ట్రేషన్ ఉంటే వారితో తేల్చుకోవాలి, కానీ తనపై హత్యాయత్నం చేయడం ఏంటని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవిత, ఆమెకు సంబంధించిన తెలంగాణ జాగృతి కార్యకర్తలు తనపై హత్యాయత్నం చేశారని చింతపండు నవీన్ ఆరోపించారు. తన ఆఫీసులో దాడి తరువాత తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడారు.
‘నాపై దాడులు చేస్తే బీసీ ఉద్యమం ఆగిపోతుంది అనుకుంటే అది మీ భ్రమే. నాపై హత్యాయత్నాలతో బీసీ ఉద్యమాన్ని ఆపలేరు. ఇలాంటి దాడులకు తీన్మార్ మల్లన్న భయపడుతాడు అనుకుంటే అది మీ భ్రమే. కవిత అనుచరుల దాడిలో నా చేతికి గాయమైంది. దాడులను గమనించిన మా గన్‌మెన్ అప్రమత్తం అయ్యారు. కానీ ఆ గూండాలు గన్ మెన్ వద్ద నున్న తుపాకీ లాక్కొని మరీ మా ఆఫీసులో బీభత్సం చేశారు. మా సిబ్బందిపై దాడి చేయడంతో పాటు ఫర్నీచర్, ఆఫీసులో అద్దాలు ధ్వంసం చేసి హత్యాయత్నం చేశారు. ఈ దాడుల్లో నాతో పాటు కొందరు సిబ్బందికి గాయాలు అయ్యాయి.
ఇలాంటి ఘటనలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించాలి. ఈ దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. పోలీసులపై, న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది. న్యాయం జరుగుతుందనే నమ్ముతున్నాం. భవిష్యత్తులో మిమ్మల్ని రాజకీయంగా పాతాళానికి తొక్కుతాం. బీసీ సమస్యలపై మా సలహాలను ప్రభుత్వం స్వీకరిస్తోంది. ఇందులో కవితకు వచ్చిన బాధ ఏంటో అర్థం కావడం లేదు. సహచర ఎమ్మెల్సీపై హత్యాయత్నం చేపించిన కవిత ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని ప్రభుత్వం రద్దు చేయాలి. కవిత తన ఉనికి కోసం కేసీఆర్ ను ప్రశ్నించాలి. కేటీఆర్ తో పోరాడాలి. కానీ ఫ్రస్ట్రేషన్లో ఉన్నా కదా అని తోటి ప్రజాప్రతినిధులపై దాడులు చేపించడం సరికాదు. వీటి వల్ల ప్రజల్లో మరింత చులకన అవుతారు’ అని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు.