Telangana Jagruthi Activists Vandalize MLC Teenmar Mallannas Office | హైదరాబాద్‌: ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న కార్యాలయంపై ఆదివారం నాడు దాడి జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మేడిపల్లిలోని తీన్మార్‌ మల్లన్న ఆఫీసుపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజుల నుంచి కవిత బీసీ ఉద్యమానికి, బీసీ రిజర్వేషన్లపై ఉద్యమిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీల నేతలను, బీసీ సంఘాలను కలిసి 42 శాతం రిజర్వేషన్ల కోసం మద్దతు కూడగడుతున్నారు. 

ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవిత చేస్తున్న బీసీ ఉద్యమం అంతా నాటకమేనని తీన్మార్ మల్లన్న తప్పుపట్టారు. మరింత హద్దు దాటి కవితపై వ్యక్తిగతంగా సైతం తీన్మార్ మల్లన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారని జాగృతి సభ్యులు, ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వేమైనా బీసీవా, బీసీలకు ఏమొస్తే నీకెందుకు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మేడిపల్లిలోని తీన్మార్ మల్లన్న ఆఫీసు మీద దాడి చేసి, ఫర్నిచర్‌, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. తమ ఆఫీసుపై జరుగుతున్న దాడిని అడ్డుకునేందుకు, పరిస్థితిని అదుపు చేసేందుకు తీన్మార్ మల్లన్న గన్ మెన్ గాల్లోకి కొన్ని రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దాడులకు పాల్పడిన ఆందోళనకారులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు.

కాల్చిపడేస్తా అని ఆందోళనకారులకు గన్ మెన్ వార్నింగ్..

ఎమ్మెల్సీ కవితపై తీన్మార్‌ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మేడిపల్లిలోని ఎమ్మెల్సీ కార్యాలయంపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు, ఆమె అనుచరుల వంద మంది వరకు వెళ్లి దాడి చేశారు. ఆఫీసులో ఫర్నీచర్ ధ్వంసం చేస్తూ, దాడులకు దిగిన సమయంలో డోర్లు మూసివేసి ప్రాణరక్షణ కోసం ప్రయత్నించారు. డోర్ అద్దాలు పగలగా అందులోనుంచి గన్ ఎక్కుపెట్టి గన్ మెన్ ఆందోళనకారులను హెచ్చరించారు. ఎవరైనా ముందుకొస్తే కాల్చిపడేస్తాను అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ గన్ మెన్ హెచ్చరించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఏసీపీ, సీఐ, మేడిపల్లి పోలీసులు తీన్మార్ మల్లన్న ఆఫీసుకు వెళ్లి పరిశీలించారు. ఘటన వివరాలను ఎమ్మెల్సీ ఆఫీసు సిబ్బందిని అడిగి తెలుసుకుంటున్నారు. 

తీన్మార్ మల్లన్న ఆఫీసులో రక్తపు మరకలు

కొందరు ఆందోళనకారులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీసులోకి చొరబడి హంగామా చేశారు. కొంత సమయంపాటు ఆఫీసులో బీభత్సం సృష్టించారు. గన్ మెన్ కాల్చిపారేస్తా అని హెచ్చరించినా ఆందోళనకారులు వెనక్కి తగ్గకుండా ఫర్నీచర్ ధ్వంసం చేస్తూ ముందుకు దూసుకెళ్లారు. ఆఫీసులో చాలా వరకు రక్తపు మరకలు కనిపించడం కలకలం రేపుతోంది. ఈ దాడుల్లో, గన్ మెన్ కాల్పుల్లో కొందరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడిన వారికి తీవ్ర రక్తస్రావం కావడంతో తీన్మార్ మల్లన్న ఆఫీసులో రక్తపు మరకలు కనిపిస్తున్నాయి.