fire accident in Pasamailaram sangareddy district | పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎన్విరో వెస్ట్ మేనేజ్‌మెంట్‌లో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగి మంటలు చెలరేగాయి. దాంతో అక్కడున్న ప్రాంతాన్ని దట్టమైన పొగ కమ్మేసింది. ఎన్విరో వేస్ట్ మేనేజ్‌మెంట్ సంస్థలో చెలరేగిన అగ్నిప్రమాదంలో ఒక జేసీబీతో పాటు లారీ మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఫైరింజన్లు అక్కడికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నాయి.

పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి కెమికల్స్ కంపెనీలో ప్రమాదం తర్వాత ఇది రెండవ అగ్నిప్రమాదం. తరచుగా జరిగే ప్రమాదాలతో పారిశ్రామిక వాడల చుట్టుపక్కల ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సంస్థల్లో పనిచేసే సిబ్బంది, కార్మికులలోనూ భద్రతా ప్రమాణాలపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వంతో పాటు పరిశ్రమ యాజమాన్యం నుంచి కఠినమైన భద్రతా చర్యల కోసం డిమాండ్ వస్తోంది.