Brs Review Meeting : బీఆర్ఎస్ (Brs )పార్టీలో అసంతృప్త సెగలు భగ్గుమంటున్నాయి. అసలే అధికారం కోల్పోయిన గులాబీ పార్టీకి వర్గపోరు ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో జరిగిన చేవెళ్ల లోక్‌సభ (Chevella Lok sabha) సన్నాహక సమావేశంలో గ్రూపు తగాదాలు బయటపడ్డాయి. పార్టీ సీనియర్ నేత హరీశ్ రావు ఎదుటే మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి, పరిగి మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి అనుచరులు వాగ్వాదానికి దిగారు. ఇరువర్గాల నినాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మాజీ మంత్రి హరీశ్ రావు... రెండు వర్గాలకు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు
పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహాలకు పదును పెడుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమిపై సమీక్షలు చేసుకుంటూనే..పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చిస్తున్నారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మధుసూదనాచారి, ఆధ్వర్యంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. సిట్టింగ్ ఎంపీలతో పాటు మాజీ ఎంపీలు, అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో పార్టీ అగ్రనేతలు అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలపై అంతర్గతంగా సమీక్షలు చేస్తున్నారు.
ఈ నెల 3 నుంచి పార్లమెంట్ స్థానాల వారిగా సమీక్షలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆదిలాబాద్, కరీంనగర్ లోక్ సభ స్థానాలపై సమావేశాలు ముగిశాయి. శనివారం పెద్దపల్లి, 7న నిజామాబాద్, 8న జహీరాబాద్, 9న ఖమ్మం, 10న వరంగల్, 11న మహబూబాబాద్, 12న భువనగిరి, 16న నల్గొండ, 17న నాగర్‌కర్నూల్, 18న మహబూబ్‌నగర్, 19న మెదక్, 20న మల్కాజ్‌గిరి, 21న సికింద్రాబాద్, హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు జరుగుతాయి. సంక్రాంతి పండుగ సందర్బంగా మూడు రోజుల విరామమివ్వనున్నారు. పండుగ తర్వాత రెండో విడత సమావేశాలను నిర్వహించనుంది.
నియోజకవర్గానికి 5 వందల మందికి ఆహ్వానం
తెలంగాణ భవన్ లో జరిగే సమీక్షా సమావేశాలకు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం సిట్టింగ్ ఎంపీలతో పాటు వంద మంది నేతలతో పాటు 5వందల మంది కార్యకర్తలకు ఆహ్వానిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణాలు, ప్రత్యర్థులు విజయానికి అనుకూలించిన పరిస్థితులు, సామాజిక సమీకరణాలపై సీనియర్ నేతలు చర్చిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో నేతల పనితీరు, పార్టపై ప్రజలకు ఉన్న అభిప్రాయం, నేతల బలాబలాలపై సుదీర్ఘంగా అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. సమావేశాల్లో వచ్చిన రిజల్ట్ ను బట్టి పార్లమెంట్ ఎన్నికలకు వ్యూహాలను సిద్ధం చేయనుంది. తక్కువ ఓట్ల మెజార్టీతో ఓడిపోయిన స్థానాల్లో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించనున్నారు. పార్లమెంట్ స్థానాలు సమీక్ష ముగిసిన తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాలపైనా బీఆర్ఎస్ సమీక్ష చేయాలని నిర్ణయించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయిన వారికి మళ్లీ టికెట్లు ఇవ్వవద్దని కొందరు నేతలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓటమి పాలయిన మంత్రులను మరో రకంగా ఉపయోగించుకోవడంపై బీఆర్ఎస్ ఆలోచిస్తోంది.
Also Read: Telangana: ప్రయాణికులకు గుడ్‌న్యూస్, సంక్రాంతికి TSRTC స్పెషల్ బస్సులు: సజ్జనార్