బీసీ జనగణన చేయాలని కొత్తగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని, వారికి రిజర్వేషన్లు కల్పించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీసీ జనగణన చేయాలని డిమాండ్ చేస్తున్న రాహుల్ గాంధీ గత 60 ఏళ్లు ఏం చేశారని ప్రశ్నించారు. రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా ఎంత మంది బీసీలు ఉన్నారో గుర్తించాలని అన్నారు. బీసీ మంత్రిత్వ శాఖ గురించి బీఆర్ఎస్ ఎన్ని సార్లు అడిగినా కేంద్రంలో బీజేపీ స్పందించలేదని.. కాంగ్రెస్ కనీసం మాట్లాడలేదని అన్నారు.


2014లో కేసీఆర్ సీఎం కాగానే, బీసీలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానించారని గుర్తు చేశారు. బీసీలకు ప్రత్యేక కమిషన్ ఉండాలని బీఆర్ఎస్ తొలిసారి డిమాండ్ చేసిందని అన్నారు. 2016-17లో కేంద్రం బీసీ కమిషన్ పెట్టిందని అన్నారు. దేశంలో ఇంత మంది బీసీలు ఉంటే వారి కోసం కేంద్రంలో బీసీ సంక్షేమ శాఖ ఉండాలని కూడా డిమాండ్ చేశారు. గత 60 ఏళ్లలో రాహుల్ గాంధీ బీసీల గురించి ఎందుకు పట్టించుకోలేదని అన్నారు. దేశంలో బీసీలకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. 


‘‘60 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీ వర్గీకరణ చేయలేదు. రాహుల్ గాంధీ ఇప్పుడు కుల గణన చేస్తామని మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నాయకులు ఎప్పుడు బీసీల గురించి మాట్లాడలేదు. దేశంలో ఎంత మంది బీసీలు ఉన్నారో లెక్క తేల్చాలి. మహిళ బిల్లులో కూడా బీసీ మహిళల కోటా తేల్చాలి. గణేష్ గుప్తాకు ఓటు వేస్తే కేసీఆర్ కు వేసినట్టే’’ అని కవిత అన్నారు.