తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా చేసిన అసంతృప్తికర వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు వరుసగా కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత స్పందించారు. గవర్నర్ తమిళిసై రాజ్ భవన్ ను రాజకీయ వేదికగా మార్చాలని చూస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. గవర్నర్ వ్యాఖ్యలపై ఆమె ట్విటర్‌ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ ను అపఖ్యాతి పాలు చేయడమే గవర్నర్ తమిళిసై లక్ష్యంగా పెట్టుకున్నారని కవిత విమర్శించారు. తప్పుడు ప్రచారంతో తెలంగాణ ప్రజల మన్ననలు పొందుదామని చూడడం సరికాదని అన్నారు. బీజేపీ కూడా అదే విధానం ఫాలో అవుతోందని, గవర్నర్ ద్వారానే ఇలాంటి ప్రకటనలు స్వయంగా చేయిస్తోందని విరుచుకుపడ్డారు.






గవర్నర్ గా మూడేళ్లు పూర్తి
తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా గవర్నర్‌గా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం (సెప్టెంబరు 8) రాజ్ భవన్‌లో ప్రత్యేక కార్యక్రమం గవర్నర్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ కేసీఆర్ పై, ప్రభుత్వం తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్‌భవన్‌కు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో ఇక్కడి అధికారులు రాజ్ భవన్ ను అస్సలు పట్టించుకోవడం లేదని గవర్నర్‌ తెలిపారు. 


గవర్నర్ ఆఫీసును ప్రభుత్వం చులకనగా చూస్తోందని, తీవ్రమైన వివక్ష చూపిస్తోందని విమర్శించారు. రాజ్ భవన్ ఏమైనా అంటరాని స్థలమా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు ఇక్కడికి రావడం లేదని నిలదీశారు. ఒక మహిళను అవమానించిన ప్రభుత్వంగా ముద్ర పడకూడదని అన్నారు. రాష్ట్ర గవర్నర్ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలియాల్సి ఉందని చెప్పారు.


హెలీకాప్టర్ అడిగితే కనీస స్పందన లేదు
ఈ సందర్భంగా గవర్నర్ కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైన మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక గవర్నర్ స్థానానికి ప్రభుత్వం తగిన గౌరవం ఇవ్వడం లేదని వాపోయారు. తాను మేడారం, భద్రాచలం పర్యటనలకు వెళ్లినప్పుడు హెలీకాప్టర్ అడిగితే కనీసం ఎవరూ స్పందించలేదని గుర్తు చేశారు. చేసేది లేక తాను రోడ్డు మార్గం ద్వారా 8 గంటలు ప్రయాణించి వెళ్లాల్సి వచ్చిందని అన్నారు. పర్యటనల్లో కూడా కలెక్టర్, సీపీ లాంటి ఉన్నతాధికారులు ప్రోటోకాల్ ప్రకారం కూడా హాజరుకాకపోవడాన్ని గవర్నర్ తప్పుబట్టారు. ప్రజల్ని కలవాలంటే కూడా తనకు ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు.


మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్
గవర్నర్ తమిళి సై బీజేపీ నాయకురాలిగా మాట్లాడుతున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ తన బాధ్యత నిర్వర్తించాలి కానీ ప్రభుత్వంపై అనవసర వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. సీఎం కేసీఆర్ రాజ్ భవన్ కు ఎప్పుడు వెళ్లాలన్నది ఆయన ఇష్టమని, గవర్నర్ తన పరిధి దాటి బీజేపీ ప్రతినిధిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. వరదలు సంభవిస్తే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉండగా గవర్నర్ ఏం పని పరామర్శలు చేయడానికి అని ప్రశ్నించారు. తెలంగాణ చరిత్ర గవర్నర్ కు తెలియదని, అందుకే విమోచనం అంటున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కు మహిళల పట్ల చాలా గౌరవం ఉందన్నారు. గవర్నర్ స్థాయిని మర్చిపోయి మాట్లాడుతున్నారన్నారు. గత గవర్నర్లతో రానీ సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చిందో చెప్పాలన్నారు. ఎవరికి ఎవరూ దూరమయ్యారో గవర్నర్ ఆలోచించాలని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.