Ganesh Nimajjanam 2022: గణేష్ నవరాత్రులు ఘనంగా ముగిశాయి. నిమజ్జనానికి తెలంగాణ వ్యాప్తంగా విస్తృత ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. కరోనా కారణంగా ఇప్పటి వరకు వినాయక చవితిని వైభవంగా చేసుకోలేని భక్తులు ఈ ఏడాది పెద్ద స్థాయిలో జరుపుకున్నారు. వాడవాడలా విగ్రహాలు పెట్టి గణనాథుడి మనసారా పూజలు చేశారు. నవరాత్రుల్లో ఆధ్యాత్మికత వెల్లివెరిసింది. ఇప్పుడు చివరి ఘట్టం వచ్చేసింది.
నవరాత్రుల్లో 8రోజుల పాటు ఎంత హడావుడి ఉంటుందో.. ఆఖరి రోజు అయితే అంతకు మించిన సందడి కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈ కోలాహలం వేరేగా చెప్పక్కర్లేదు. నిమజ్జన సంబరాలు ఆకాశమే హద్దుగా సాగుతుంటాయి. విగ్రహాలను మండపాల నుంచి తరలించినప్పటి నుంచి మళ్లీ ఆ విగ్రహాలను జాగ్రత్తగా గంగలోకి చేర్చే వరకు భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోతారు.
భక్తులకు అత్యంత ప్రాధాన్యమైన వేడుక కాబట్టే ప్రభుత్వం కూడా హైదరాబాద్‌లో ప్రత్యేక ఏర్పాటు చేసింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ను మళ్లించింది. విగ్రహాల శోభాయాత్రతో ప్రజలు, నగరవాసులతో భక్తులు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఏ ప్రాంత విగ్రహాలు ఎక్కడ నిమజ్జనం చేయాలి. ఏ రూట్‌లో శోభాయాత్ర వెళ్లాలనే రూట్‌మ్యాప్‌ను పోలీసులు ఆయా సంఘాలకు ఇచ్చారు.
భాగ్యనగరంలో 354 కిలోమీటర్ల మేర శోభాయాత్ర సాగనుంది. ఇప్పటికే హుసేన్ సాగర్ చుట్టూ 32 భారీ క్రేన్‌లు ఏర్పాటు చేశారు అధికారులు. వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయడానికి 33 చెరువులు, 74 ప్రత్యేక పాండ్స్ రెడీ చేశారుు. 106 స్టాటిక్ క్రేన్లు, 208 మొబైల్ క్రేన్లు అందుబాటులో ఉంచారు. 168జీహెచ్‌ఎంసీ యాక్షన్ టీంలు రెడీ కాగా... విధుల్లో 10 వేల మంది శానిటేషన్ వర్కర్లు కూడా పాల్గోనున్నారు.
ఊరేగింపు మార్గాలను కమిషనర్ సీవీ ఆనంద్ పరిశీలించారు. ఏర్పాట్లపై ఆరా తీశారు. ముఖ్యంగా పాతబస్తీపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. శోభయాత్ర జరిగే ప్రాంతాల్లో విద్యుత్ సహా ఇతర వైర్లు విగ్రహాలకు తగలకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. మూడు రోజుల పాటు హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ పరిధిలో మద్యంషాపులు బంద్ ప్రకటించారు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఉద్యోగుల కోసం మెట్రోల ప్రత్యేక సర్వీస్‌లు నడపనుంది. రాత్రి రెండు గంటల వరకు సర్వీస్‌లు ఉంటాయని మెట్రో అధికారులు ప్రకటించారు.
తెలంగాణలోని వివిధ జిల్లాల్లో కూడా నిమజ్జనానికి విస్తృతంగా ఏర్పాటు చేశారు ఆయా జిల్లాల అధికారులు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెట్టారు.