Kalvakuntla Kavitha on Rahul Gandhi: నేడు తెలంగాణ పర్యటనకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ రానున్న వేళ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆయన్ను కొన్ని ప్రశ్నలు అడిగారు. ట్విటర్ వేదిగా కవిత రాహుల్‌ను ప్రశ్నించారు. మీరు కానీ, మీ పార్టీ కానీ పార్లమెంటులో తెలంగాణకు సంబంధించిన అంశాలు, హక్కులను ఎన్నిసార్లు ప్రస్తావించారో చెప్పాలని అడిగారు. రాష్ట్ర హక్కుల కోసం టీఆర్‌ఎస్‌ పోరాడుతుంటే రాహుల్‌ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టులకు రావాల్సిన జాతీయ హోదా,  రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన పెండింగ్ జీఎస్టీ బకాయిల నిధుల గురించి టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.


దేశ వ్యాప్తంగా వరి కొనుగోలు విధానం ఒకేలా ఉండాలని తాము పోరాడుతున్నప్పుడు ఎక్కడికిపోయారని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు విద్యాసంస్థలు ఇవ్వకుండా మొండి చేయి చూపిస్తున్నప్పుడు ఎక్కడున్నారని ఎమ్మెల్సీ కవిత నిలదీశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, ఆసరా, వంటి పథకాలపై ఆరా తీసి అవి తెలంగాణ ముఖ చిత్రాన్ని ఎలా మార్చాయో తెలంగాణ కాంగ్రెస్ నాయకులను అడిగి తెలుసుకోవాలని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను స్పూర్తిగా తీసుకుని 11 రాష్ట్రాలు అమలుచేస్తున్నాయని.. వాటి గురించి నేర్చుకుని అర్థం చేసుకోవడానికి మీకు తెలంగాణకు స్వాగతం అంటూ కవిత వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.


‘‘గౌరవ రాహుల్ గాంధీ గారూ, మీరు గానీ, మీ పార్టీ కానీ ఎన్నిసార్లు పార్లమెంటులో తెలంగాణ అంశాలను, హక్కులను ప్రస్తావించారో చెప్పండి. తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం టీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంటే మీరు ఎక్కడ ఉన్నారు? దేశ వ్యాప్తంగా ఒకే వరి కొనుగోలు విధానంపై టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? తెలంగాణ ప్రాజెక్టులకు రావాల్సిన జాతీయ హోదా, తెలంగాణ రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన పెండింగ్ జీఎస్టీ బకాయిలు, నిధుల గురించి టీఆర్ఎస్ పోరాటం చేస్తున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు విద్యాసంస్థలు ఇవ్వకుండా మొండిచేయి చూపిస్తున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన రైతు బంధు రైతు బీమా కల్యాణ లక్ష్మి ఆరోగ్య లక్ష్మి ఆసరా వంటి పథకాలపై ఆరా తీసి అవి తెలంగాణ ముఖ చిత్రాన్ని ఎలా మార్చాయో మీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులను అడిగి తెలుసుకోండి. సీఎం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలను స్ఫూర్తిగా తీసుకొని 11 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. వాటి గురించి నేర్చుకొని అర్థం చేసుకోవడానికి మీకు కూడా తెలంగాణకు స్వాగతం’’ అని కవిత ట్వీట్ చేశారు.