Saroornagar Honour Killing : హైదరాబాద్ సరూర్ నగర్ మర్డర్ కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎల్బీనగర్ డీసీపీ సంప్రీత్ సింగ్ తెలిపారు. ఈ కేసు వివరాలను ఆయన గురువారం మీడియాకు వివరించారు. బుధవారం రాత్రి సరూర్ నగర్ లో మర్డర్ కేసులో బాలానగర్ కి చెందిన సయ్యద్ మొబిన్ అహ్మద్, షేర్ లింగంపల్లికి చెందిన నసీర్ ను అరెస్ట్ చేశామని తెలిపారు. ప్రధాన నిందితుడు సయ్యద్ మోబిన్ అహ్మద్ సోదరని మృతుడు నాగరాజు ఈ ఏడాది జనవరి 31న ప్రేమ వివాహం చేసుకున్నాడు. అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఆర్యసమాజ్ లో వివాహం చేసుకుంది. యువతి కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేస్ పెట్టడంతో ట్రేస్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు పోలీసులు.
యువతి సోదరుడు సయ్యద్ అప్పటి నుంచి నాగరాజుపై కోపం పెంచుకున్నాడు. మృతుడు నాగరాజు సయ్యద్ సిస్టర్ చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. అనంతరం ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. నాగరాజు గురించి ప్రధాన నిందితుడు పూర్తిగా విచారణ చేసి ప్లాన్ ప్రకారం బైక్ పై వెళ్తోన్న వారిని కొట్టి చంపాడు. గతంలో కూడా నాగరాజును చంపడానికి ప్లాన్ చేసి విఫలమయ్యాడు. ఈ కేసు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో త్వరగా పూర్తి చేసి నిందితులకి శిక్ష పడేలా చేస్తామని డీసీపీ తెలిపారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ అందెలా చేస్తామన్నారు. దయచేసి ఈ కేసు విషయంలో ఎలాంటి సమస్యలు సృష్టించవద్దని డీసీపీ కోరారు.
అసలేం జరిగింది?
పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. అన్యోన్యంగా ఉంటున్న టైంలో పిడుగులాంటి సంఘటన. సరూర్‌నగర్ పరిధిలో జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. బుధవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో కొత్త జంటపై దాడి జరిగింది. ఈ దుర్ఘటనలో భర్త స్పాట్‌లోనే చనిపోయాడు. రంగారెడ్డి జిల్లా మర్పల్లికి చెందిన బిల్లారపురం నాగరాజు, మర్పల్లి సమీపంలోని ఘనాపూర్ వాసి ఆశ్రిన్ సుల్తానా ప్రేమించుకున్నారు. విషయం తెలుసుకున్న ఆశ్రిన్ బంధువులు నాగరాజును హెచ్చరించారు. ఆమె వెంట తిరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ప్రమాదాన్ని గ్రహించిన నాగరాజు హైదరాబాద్‌లో ఉద్యోగం వెతుక్కున్నాడు. ఓ కంపెనీలో సేల్స్‌మెన్‌గా చేరాడు. స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకుందామని ఆశ్రిన్‌కు చెప్పాడు.
అనుకున్నట్టుగానే లైఫ్‌లో స్థిరపడ్డ తర్వాత ఆశ్రిన్‌కు కబురు పెట్టాడు. జనవరిలో ఇంట్లో చెప్పకుండా ఆశ్రిన్ హైదరాబాద్ వచ్చేసింది. ఆర్యసమాజ్‌లో జనవరి 31న ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. తమ జాడ ఆశ్రిన్ బంధువులకు తెలియకుండా ఉండేందుకు ఉద్యోగం, నివాసాన్ని కూడా మార్చేశారు. ఆశ్రిన్, నాగరాజు ఎన్ని ప్లేస్‌లు మారుతున్నా ఆమె బంధువులు వదల్లేదు. వెంటాడుతునే ఉన్నారు. ప్రస్తుతం సరూర్‌నగర్‌లో ఉన్నారని తెలుసుకున్న ఆశ్రిన్ బంధువులు మరోసారి దాడి చేశారు.