Anantapur Crime :వివాహేతర సంబంధాలతో కుటుంబాలు కుప్పకూలుతూనే ఉన్నాయి. ఇటీవల ధర్మవరంలో ఏప్రిల్ ఎనిమిదో తేదీన గంగాధర్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. దీనిని కాల్ మనీ హత్యగా అందరూ భావించారు. గంగాధర్ ను వడ్డీ వ్యాపారులు హత్య చేశారంటూ భార్య పల్లపు లక్ష్మిదేవీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఇది కాల్ మనీ మర్డర్ అంటూ ధర్మవరంలో సంచలనం రేకెత్తించింది. పోలీసులు కూడా అదే కోణంలో విచారణ మొదలుపెట్టారు. కానీ పోలీసులు విచారణలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. ఈ హత్యకు కాల్ మనీకు సంబంధం లేదని తేల్చారు. భార్యే ఇంతటి దారుణానికి పాల్పడిందన్న నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇంకా అంతకన్నా దారుణం ఏంటంటే ఈ హత్యకు నిందితురాలి అన్న, అల్లుడు పాల్పడిన షాకింగ్ విషయాలు దర్యాప్తులో వెల్లడయ్యాయి.
ఏం జరిగిందంటే?
అనంతపురం జిల్లా ధర్మవరంలో పల్లపు లక్ష్మిదేవి, గంగాధర్ కుటుంబం ఉండేది. గంగాధర్ వడ్డీ వ్యాపారుల వద్ద దాదాపుగా ఎనిమిది లక్షల రూపాయలు అప్పులు చేశాడు. ఈ అప్పుల్నే అతడి భార్య హత్యకు కారణంగా వాడుకుంది. అతడి భార్య లక్ష్మిదేవి ధర్మవరంలోని తారకరామాపురానికి చెందిన భాస్కర్ రెడ్డితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ సంబంధానికి భర్త అడ్డుగా ఉండడంతో భార్య లక్ష్మిదేవి దారుణమైన పన్నాగం పన్నింది. హత్య చేసి వడ్డీ వ్యాపారుల ఖాతాలోకి వేస్తే అప్పుకు అప్పు, అడ్డుగా ఉన్న భర్త ఇద్దరి పీడ విరగడ అవుతుందని ప్లాన్ చేసింది. అనుకున్నదే తడువుగా తన అన్న గొడ్డెండ్ల వెంకటేష్, అల్లుడు(కూతురి భర్త) బండారు సుధాకర్ తో మాట్లాడింది. ఈ హత్య చేసేందుకు సుపారీ కూడా ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. దీంతో నిందితులు ఏప్రిల్ ఎనిమిదో తేదీన ధర్మవరంలోని ఎల్పీ కూడలి వద్ద ఉన్న రైల్వే పార్క్ లో గంగాధర్ ను దారుణంగా హత్య చేసి పరారయ్యారు.
కాల్ మనీ హత్యగా క్రియేట్
ఈ కేసులో మృతుడి భార్య పోలీసులను తప్పుదోవ పట్టించింది. తన భర్తను వడ్డీవ్యాపారులే హత్య చేశారని పోలీసులుకు ఫిర్యాదు చేసింది. అప్పటికే ధర్మవరంలో ఇలాంటి ఘటనలు జరగడంతో మీడియా కూడా పోలీసుల వైఫల్యాలను ప్రశ్నించింది. దీంతో సీరియస్ గా తీసుకున్న పోలీసులకు విచారణలో నిందితురాలు లక్ష్మిదేవికి ఉన్న అక్రమ సంబంధం, సాంకేతికత ఆధారంగా ఫోన్ డేటాను విశ్లేషించిన పోలీసులకు షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. తమదైన శైలిలో పోలీసులు విచారణ చేసేసరికి నిందితులు తాము చేసిన దారుణాన్ని ఒప్పుకొన్నారు. వివాహేతర సంబంధాల నేపథ్యంలో కట్టుకున్న భార్య, ఆమె కుటుంబ సభ్యులు హత్యకు పాల్పడటం సంచలనంగా మారింది. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. సంచలనంగా మారిన కేసులో పోలీసులు వ్యూహాత్మకంగా సాంకేతికతను ఉపయోగించి ఛేదించడంతో ధర్మవరం పోలీసులను అభినందించారు సత్యసాయి జిల్లాఎస్పీ రాహుల్ దేవ్ సింగ్.