ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, తరచూ పోలీసుల చర్యలు ఎదుర్కొనే బీజేపీకి చెందిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హైదరాబాద్ పోలీసులు లక్ష్యంగా ఓ ట్వీట్ చేశారు. తాను ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాతపూర్వకంగా డీజీపీకి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు మొదలుపెట్టలేదని అన్నారు. ఒక ఎమ్మెల్యేను చంపుతామని బెదిరింపు కాల్స్, మెసేజ్‌లు వస్తున్నందున ఫిర్యాదు చేస్తే ఎందుకు పట్టించుకోవడం లేదని వాపోయారు. 


‘‘ఇది నిజంగా ఆశ్చర్యకరం. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే పాకిస్థాన్ నుంచి బెదిరింపు కాల్స్ ఎదుర్కొంటుంటే కనీసం హైదరాబాద్ పోలీసులు స్పందించడం లేదు. ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయడం లేదు. నేను జై శ్రీరామ్ అని ఒక్క ట్వీట్ చేసినా, హిందువులకు మద్దతుగా నా గొంతు విప్పినా, నాపై కేసులు పెట్టి చర్యలు తీసుకొనే పోలీసులు.. ఇప్పుడు మాత్రం అస్సలు స్పందించడం లేదు. హైదరాబాద్ పోలీసులూ.. తక్షణం స్పందించేందుకు మీకు ఏం అడ్డు వస్తోంది’’ అని ట్వీట్ చేశారు.


గత నెలలో ఫిర్యాదు
ఎమ్మెల్యే రాజాసింగ్ ఫిబ్రవరి 22న పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు కొన్ని నెంబర్ల నుంచి వాట్సప్ కాల్స్, వాట్సప్‌లలో మెసేజ్‌లు వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు బెదిరింపులు వస్తున్న ఫోన్ నెంబర్లను కూడా లేఖలో పేర్కొన్నారు. ఆ నంబర్లన్నీ విదేశీ కోడ్‌తో మొదలయ్యాయి.






ఆగస్టు నుంచి జైల్లో.. నవంబరులో విడుదల


గతేడాది ఆగస్టు 25న రాజాసింగ్‌పై హైదరాబాద్ పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేశారు. ఆగస్టు 22వ తేదీన సోషల్ మీడియాలో రాజాసింగ్ ఓ వీడియో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోలో మహ్మద్ ప్రవక్తను కించపర్చేలా ఉందని ఎంఐఎంతో పాటు ముస్లింలు ఆందోళన వ్యక్తం చేశారు. రాజాసింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో గతేడాది ఆగస్టు 23న ఆయనను అరెస్ట్ చేశారు. అయితే అదే రోజు ఆయనకు నాంపల్లి కోర్టు బెయిల్ ఇచ్చింది. ఆగస్టు 25న రాజాసింగ్‌పై పీడీయాక్ట్ నమోదు చేసి మళ్లీ అరెస్ట్ చేశారు. అలా చాలా రోజులు రాజాసింగ్ చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. 


గత ఏడాది నవంబరులో రాజాసింగ్ విడుదలతో మంగళ్ హాట్ లోని రాజాసింగ్ ఇంటి వద్ద ఆయన బంధువులు, స్నేహితులు సంబురాలు చేసుకున్నారు. పెద్ద ఎత్తున టపాసులు కాలుస్తూ.. సంతోషాన్ని వ్యక్తం చేశారు. పలు చోట్ల ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు సంబురాలు జరుపుకొన్నారు. అయితే ఇంటికి చేరుకున్న తర్వాత ఎమ్మెల్యే రాజాసింగ్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. శ్రీరాముడు, గోమాత ఆశీర్వాదం వల్లే తాను క్షేమంగా బయటకు వచ్చినట్లు అందులో పేర్కొన్నారు. తన అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించిన హిందువులు, అనుచరులు, మద్దతుదారులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నట్లు వివరించారు.