తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ అధిష్ఠానం ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ఖరారు ఖరారు చేసి జాబితా విడుదల చేయనున్న వేళ రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. టికెట్ ఫలానా వారికి ఇవ్వబోతున్నారనే వదంతుల నేపథ్యంలో గతంలో బేదాభిప్రాయాలు ఉన్నవారు కలిసిపోతున్నారు. తాజాగా ఉప్పల్ నియోజకవర్గంలో ఇలాంటి పరిణామమే జరిగింది. ఉప్పల్‌లో బి.లక్ష్మా రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఇస్తారనే ఊహాగానాలు బలంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో స్థానిక నేతలు, ప్రస్తుత ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఒక్కటయ్యారు. వీరిద్దరూ కలిసి ఎమ్మెల్సీ కవితను కలిశారు.
ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, బొంతు రామ్మోహన్ తామిద్దరిలో ఒకరికి టికెట్ ఇచ్చేలా చూడాలని ఎమ్మెల్సీ కవితను కోరారు. వేరే వారికి టికెట్ ఇవ్వవద్దని కోరారు. అయితే, ఈ విషయాన్ని తాను అధిష్ఠానానికి తీసుకెళ్తానని కవిత హామీ ఇచ్చినట్లుగా సమాచారం.
ఆగస్టు 21న సోమవారం స్వయంగా సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ వేదికగా అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారని సమాచారం ఉన్న సంగతి తెలిసిందే. తొలి జాబితాలో భాగంగా 80 మంది వరకూ ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. దీంతో కొంత మంది సిట్టింగుల్లో ఆందోళన నెలకొంది. వీరిలో ఉప్పల్ సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిని మార్చాలని బీఆర్ఎస్ అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లుగా సమాచారం.
ఉప్పల్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇస్తే ఓటమి తప్పదని అభిప్రాయాలు రావడంతో మార్చాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే నియోజకవర్గంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బండారి లక్ష్మా రెడ్డి ఈసారి ఎమ్మెల్యే టికెట్ తనకే వస్తుందని ధీమాగా ఉన్నారు. ప్రతి రోజు వివిధ కాలనీల్లో సందర్శిస్తూ వారి మద్దతును కూడగట్టుకుంటున్నారు.
ఒక్కోసారి ఒక్కొక్కరు గెలుపు
2009లో ఏర్పడిన ఉప్పల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి కూడా వరుసగా గెలవలేదు. 2009లో తొలిసారి కాంగ్రెస్ అభ్యర్థి బండారి రాజిరెడ్డి విజయం సాధించగా, 2014 లో బీజేపీ అభ్యర్థి ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్ గెలిచారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి భేతి సుభాష్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఉప్పల్ బరిలో దిగేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డితో పాటు జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి సోదరుడు బి. లక్ష్మా రెడ్డి, జీహెచ్‌ఎంసీ డిప్యుటీ మేయర్ భర్త మోతె శోభన్ రెడ్డి కూడా పోటీలో ఉన్నారు.