Drug Mafia: అమాయకులు, డబ్బు అవసరాలు ఉన్నవారికి నైజీరియన్ నేరగాళ్లు వల వేస్తున్నారు. పెద్ద మొత్తంలో డబ్బు ఆశచూపించి స్మగ్లింగ్ కూపంలోకి దించుతున్నారు. అసలు విషయం తెలియని కొందరు నైజీరియన్ గ్యాంగ్ వలలో చిక్కుకుని ఆ తరువాత పోలీసులకు దొరికి జైలు పాలవుతున్నారు. చాలీచాలని సంపాదనతో జీవిస్తూ అదనపు ఆదాయం కోసం ప్రయత్నిస్తున్న వారినే ఈ ముఠా టార్గెట్ చేసుకుంటోంది.
ఇలా ఓ మహిళ నైజీరియన్ మాఫియా ఉచ్చులో పడి, తనకు తెలియకుండానే స్మగ్లర్‌గా మారింది. నైజీరియా నుంచి భారత్‌కు మత్తుపదార్థాలు తీసుకొస్తూ బెంగళూరు పోలీసులకు చిక్కి కటకటాలపాలైంది. ఇటీవల టీఎస్ న్యాబ్ పోలీసులు నైజీరియన్ల మత్తు పదార్థాలు, మత్తు మాఫియా గురించి ఆరా తీస్తోంది. ఇందులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ నైజీరియా మత్తు మాఫియా చేతిలో చిక్కుకుని కీలుబొమ్మగా మారిన విషయం వెలుగుచూసింది. ఓ యువతి ఇంజినీరింగ్ చదివింది. చిన్న ఉద్యోగం చేసేది. ఆమె వయసు 30 ఏళ్లు. గతేడాది సోషల్ మీడియాలో తమ కంపెనీలో పెట్టుబడి పెట్టడం ద్వారా లాభాలు వస్తాయంటూ ఓ మెస్సేజ్ వచ్చింది. ఇంటి అవసరాలు తీరతాయనే ఉద్దేశంతో ఒకసారి ప్రయత్నిద్దామని అనుకుంది.
చాలీచాలని జీతంతో జీవిస్తున్న యువతి అదనపు ఆదాయం వస్తుందని వారిని సంప్రదించింది. వారు ఓ లింక్ సెండ్ చేశారు. దాని ద్వారా ఎప్పటికప్పుడు లాభనష్టాలు పరిశీలించుకోవచ్చని, అవసరమైనపుడు నగదు విత్‌డ్రా చేసుకోవచ్చని భరోసా ఇచ్చారు. అది నమ్మిన యువతి రూ.10,000 పెట్టుబడి పెట్టారు. ఆటువైపు నుంచి ఆమె పేరిట యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ కేటాయించారు. మరుసటి రోజు రూ.5,000 లాభం వచ్చినట్లు వారు పంపిన లింక్ డ్యాష్ బోర్డుపై కనిపించింది.
ఎంత ఎక్కువ పెట్టుబడి పెడితే అంత లాభం పొందచ్చని నమ్మించారు. రూ.లక్షల పెట్టుబడితో, రూ.10 కోట్ల లాభాలు వస్తాయని నమ్మిస్తూ ఉచ్చులోకి దించారు. పెద్ద మొత్తంలో నగదును బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేయటం, చేతికి ఇవ్వడం సులువు కాదని నమ్మించారు. భారీ లాభాలతో తమ కంపెనీలో భాగస్వామిగా మారినట్టు మెయిల్‌కు సమాచారం పంపారు. సంస్థను చూసి, లాభాలను తీసుకెళ్లేందుకు రమ్మంటూ ఆమెను నైజీరియా ఆహ్వానించారు. వీసా, ప్రయాణ ఖర్చులు వారే భరించారు. ఖరీదైన హోటల్‌లో బస ఏర్పాటు చేశారు. ప్రత్యేక వాహనాలు, పని వాళ్లను నియమించారు.
అధికారుల నిఘా
కొద్ది రోజులు ఆమెకు నమ్మకం కలిగిన తరువాత ఆమె చేతికి ఒక సూట్‌కేస్ ఇచ్చి బెంగళూరులో అందజేయాలన్నారు. ఇదంతా వ్యాపారంలో భాగమని నమ్మించడంతో మహిళ దాన్ని వారు చెప్పిన ప్రాంతంలో అప్పగించేవారు. ఇందుకు ప్రతిఫలంగా వెళ్లిన ప్రతిసారి రూ.లక్ష నగదు, విమాన టిక్కెట్లు ఇచ్చి పంపేవారు. తరచూ ఆ మహిళ నైజీరియా వెళ్తుండటంతో అధికారులు నిఘా ఉంచారు. ఇటీవల బెంగళూరు విమానాశ్రయంలో తనిఖీల్లో అసలు విషయం బయటపడింది. సూట్‌కేస్‌లో కొకైన్ ఉన్నట్టు గుర్తించారు. ఇలా ఏడాది వ్యవధిలో 8 సార్లు నైజీరియా వెళ్లి, వచ్చేటపుడు సూట్‌కేసులు తీసుకొచ్చింది.
డ్రగ్స్ సరఫరా చేస్తున్న విషయం ఆమెకే తెలియకుండా నైజీరియన్లు స్కెచ్ వేశారు. కొకైన్‌ను చిన్న పొట్లాలుగా తయారు చేసి సూట్‌కేసు చుట్టూ ఎవరూ పసిగట్ట లేని విధంగా అమర్చేవారు. తరచూ ఆ మహిళ నైజీరియా వెళ్తుండటంతో నిఘా ఉంచిన అధికారులు చివరకు డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నట్టు నిర్ధారించారు. మహిళకు అనుమానం రాకుండా పెట్టుబడుల ముసుగులో ట్రాప్ చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. ఆన్‌లైన్‌లో వ్యాపారాలు, పెట్టుబడులు అంటూ వచ్చే ప్రకటనలు చూసి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.