హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన నీరాకేఫ్‌ బుధవారం ప్రారంభం కానుంది.  నెక్లెస్‌ రోడ్డులో ఆధునిక హంగులతో నిర్మించిన ఈ కేఫ్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి మంత్రి కేటీఆర్‌ ప్రారంభిస్తారు. 


12.20 కోట్ల రూపాయలతో ఈ కేఫ్‌ను తీర్చిదిద్దారు. హైదరాబాద్‌లోనే కాకుండా వివిధ జిల్లాల్లో కూడా  నీరాకేఫ్‌లకు నిధులు మంజూరు చేసింది. భువనగిరిలోని నందనం, రంగారెడ్డిలోని ముద్విన్‌, సంగారెడ్డిలోని మునిపల్లి, నల్గొండలోని సర్వేల్‌లో ఒక్కో నీరాకేఫ్‌కు 8 కోట్ల చొప్పున నిధులు ఇచ్చింది. ఈ కేఫ్‌ల నిర్వాహణకు గీత కార్మికులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది ప్రభుత్వం. మూడు వందల మందికి ఇందులో తర్ఫీదు ఇచ్చి రెడీ చేసింది. 


ప్రత్యేక తెలంగాణ రాకతో గీతకార్మికులు జీవితాలు బాగుపడ్డాయని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ అభిప్రాయపడ్డారు. 50ఏళ్లు దాటిన గీత కార్మికులకు 2016 పింఛన్ ఇస్తున్నామని తెలిపారు. ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడి మరణించిన గీత కార్మికుడికి ఐదు లక్షల రూపాయల పరిహారం, వైకల్యమైనవారికి రెండు నుంచి ఐదు లక్షల వరకు పరిహారంఅందిస్తున్నామన్నారు. తెలంగాణ వచ్చాక చెట్టు పన్ను రద్దు చేశామని. మూతపడ్డ దుకాణాలకు అనుమతి ఇచ్చినట్టు పేర్కొన్నారు. 


ఇంకా చేతి నిండ పని ఉంటూ కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు నీరా కేఫ్‌లు తీసుకొచ్చామన్నారు మంత్రి. దేశంలోనే ఎక్కడా లేని విధంగా గౌడ కులస్థులకు వైన్‌షాపుల్లో 15 శాతం రిజర్వేషన్ ఇచ్చామన్నారు. హరితహారంలో భాగంగా ఈత మొక్కలు కూడా నాటించామన్నారు.