Telangana Budget Session: గవర్నర్ స్పీచ్ లేకుండానే తెలంగాణ బడ్జెట్ సమావేశాలను (Telangana Budget Session 2022) ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) స్పందించారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగంతో (Governor Speech) గానీ, గవర్నర్‌గానీ ప్రారంభించాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదని ఆయన అన్నారు. ప్రతి ఏటా మొదటిసారి జరిగే సభా సమావేశాల ప్రారంభాన్ని గవర్నర్ ఉద్దేశించి ప్రసంగిస్తూ మొదలు పెట్టాలని మాత్రమే రాజ్యాంగంలో ఉందని అన్నారు. 2021 సంవత్సరంలో 8 శాసన సభ సమావేశాలు జరగ్గా.. ఇప్పుడు జరగబోయే బడ్జెట్ సమావేశాలు వాటికి కొనసాగింపు మాత్రమే అని వివరించారు. ఈ బడ్జెట్ సమావేశాలు కొత్తవి కావని అన్నారు. అందువల్ల గవర్నర్ ప్రసంగం లేదనే అంశాన్ని లేవనెత్తడం సరికాదని అన్నారు. కాబట్టి, అందరూ ఈ విషయాన్ని గ్రహించాలని వివరించారు. హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.


రాజ్యాంగం గురించి బీజేపీ నాయకులు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. గతంలో కర్ణాటక, మహారాష్ట్రల్లో పూర్తి మెజారిటీ రాకున్నా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. మహారాష్ట్రలో తెల్లవారుజామున 3 గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారని గుర్తు చేశారు. రాజ్యాంగం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పే నైతిక హక్కు కూడా ఆ పార్టీ నాయకులకు లేదని అన్నారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్నే ఎద్దేవా చేసిన వ్యక్తి మోదీ అని అన్నారు.


గవర్నర్ ప్రసంగం లేకుండానే..
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ (Telangana Aseembly) సమావేశాల్లో ఈసారి గవర్నర్ ప్రసంగం ఉండటం లేదు. గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలను నిర్వహించాలని సీఎం కేసీఆర్ (CM KCR) నిర్ణయించారు. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు. సాధారణంగా బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే సమయంలో గవర్నర్ (Telangana Governer) ప్రసంగించడం సంప్రదాయంగా వస్తోంది. రాజ్యాంగపరంగా ఖచ్చితంగా గవర్నర్ ప్రసంగం ఉండాలన్న రూల్ లేదు కానీ అలా ఓ సంప్రదాయంగా వస్తోంది. గవర్నర్‌తో ఎన్ని వివాదాలున్నా ప్రభుత్వాలు గవర్నర్ ప్రసంగాన్ని కొనసాగిస్తాయి. ఎందుకంటే గవర్నర్ సొంత ప్రసంగం చదవరు. కేబినెట్ ఆమోదించిన ప్రసంగ పాఠాన్నే చదువుతారు. అయినప్పటికీ ఈ సారి గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్ విముఖతగా ఉన్నట్లుగా తెలుస్తోంది. 


మార్చి ఏడో తేదీ నుండి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆరో తేదీన మంత్రివర్గ (Cabinet Meeting) సమావేశం జరిపి బడ్జెట్‌కు ఆమోదం తెలుపనున్నారు. ఏడో తేదీనే అసెంబ్లీలో బడ్దెట్ ప్రవేశ పెట్టనున్నారు. సాధారణంగా తొలి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. కానీ ఈ సారి గవర్నర్ ప్రసంగాన్ని వద్దనుకున్న కేసీఆర్ మొదటి రోజే ఆర్థిక మంత్రి హరీష్ రావు (Harish Rao) చేత బడ్జెట్ ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్న కేసీఆర్ గవర్నర్‌ను ఇటీవలి కాలంలో లెక్క చేయడం లేదు. గవర్నర్ వ్యవస్థ ఉనికిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రిపబ్లిక్ డే వేడుకల్లోనూ కేసీఆర్ పాల్గొనలేదు. మేడారం పర్యటనకు గవర్నర్‌కు హెలికాప్టర్ ఇవ్వకపోవడమే కాదు కనీసం ప్రోటోకాల్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్‌నే స్కిప్ చేస్తున్నారు.